ఎట్టకేలకు టీమిండియా ఓపెనర్‌ రీఎంట్రీ.. | Sakshi
Sakshi News home page

Prithvi Shaw: ఎట్టకేలకు టీమిండియా ఓపెనర్‌ రీఎంట్రీ..

Published Thu, Feb 1 2024 10:36 AM

Prithvi Shaw Returns To Mumbai Ranji Trophy 2024 Squad - Sakshi

Ranji Trophy 2023-24- Mumbai: టీమిండియా ఓపెనర్‌, ముంబై బ్యాటర్‌ పృథ్వీ షా ఎట్టకేలకు మైదానంలో దిగనున్నాడు. సుమారు ఆరు నెలల విరామం తర్వాత మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించి రంజీ టోర్నీ ఆడేందుకు సిద్ధమయ్యాడు.

గతేడాది ఆగష్టులో పృథ్వీ షా గాయపడ్డాడు. మెకాలి నొప్పి కారణంగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ, టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందిన అతడు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు.

ఇప్పట్లో రాడంటూ వార్తలు
నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ క్రమక్రమంగా కోలుకున్నాడు. అయితే, పృథ్వీ షాకు ఇప్పట్లో రిటర్న్‌ టు ప్లే(ఆర్‌టీపీ) సర్టిఫికెట్‌ లభించకపోవచ్చనే వార్తలు వినిపించాయి. దీంతో మరికొన్నాళ్లపాటు అతడు ఆటకు దూరం కానున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ వర్గాలు
ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ పృథ్వీ షా గురించి అప్‌డేట్‌ అందించాయి. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని స్పష్టం చేశాయి.

‘‘బీసీసీఐ జాతీయ అకాడమీ పృథ్వీ షాకు ఆర్‌టీపీ సర్టిఫికెట్‌ జారీ చేసింది. బుధవారమే దీనిని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌కు కూడా పంపించింది. ఎన్సీఏ నెట్స్‌లో అతడు బాగా ప్రాక్టీస్‌ చేశాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

సెలక్ట్‌ చేశామన్న సెక్రటరీ
మరోవైపు.. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి అజింక్య నాయక్‌ పృథీ షా రీఎంట్రీని ధ్రువీకరించాడు. షాను జట్టులో చేర్చామని.. ముంబై తరఫున తదుపరి మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. కాగా అజింక్య రహానే కెప్టెన్సీలో ఫిబ్రవరి 2 నుంచి ముంబై.. బెంగాల్‌తో మ్యాచ్‌ మొదలుపెట్టనుంది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ ఇందుకు వేదిక.

కాగా భారత్‌కు అండర్‌-19 వరల్డ్‌కప్‌ అందించిన కెప్టెన్‌గా పేరొందిన పృథ్వీ షా టీమిండియాలో వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటినా ఛాన్స్‌లు దక్కించుకోలేకపోయాడు. ఇక షా సారథ్యంలో ఆడిన శుబ్‌మన్‌ గిల్‌ టీమిండియాలో రోహిత్‌ శర్మకు జోడీగా ఓపెనర్‌గా పాతుకుపోయిన విషయం తెలిసిందే.

చదవండి: చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్‌ డైరెక్టర్‌ కొడుకు.. ప్రపంచంలో ఒకే ఒక్కడు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement