
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) ఆరంభ సీజన్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) ఉపాధ్యక్షుడు ఆనందీశ్వర్ పాండే శుక్రవారం ప్రకటించారు. కొత్త తేదీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.
షెడ్యూల్ ప్రకారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 24 నుంచి జనవరి 10 వరకు లీగ్ జరగాల్సి ఉంది. ఆరంభ సీజన్‌లో తెలంగాణ టైగర్స్, యూపీ ఐకాన్స్, మహారాష్ట్ర హ్యాండ్‌బాల్ హాస్లర్స్, కింగ్‌హ్యాక్స్ రాజస్తాన్, బెంగాల్ బ్లూస్, పంజాబ్ పిట్‌బుల్స్ జట్లు తలపడనున్నాయి. సురక్షిత పరిస్థితుల్లో లీగ్‌ను నిర్వహించడానికి తమ బృందం కృషిచేస్తోందని పీహెచ్‌ఎల్ సీఈవో మృణాలిని శర్మ పేర్కొన్నారు.