
బాకూ (అజర్‌బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ సెమీఫైనల్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాడు. ఫాబియనో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీస్ తొలి గేమ్‌ను ప్రజ్ఞానంద 78 ఎత్తులో ‘డ్రా’ చేసుకున్నాడు.
ప్రత్యర్థికి పలు మార్లు మెరుగైన అవకాశాలు వచ్చినా...చివరి వరకు పోరాడిన అతను ఓటమినుంచి తప్పించుకోగలిగాడు. శనివారం నల్లపావులతో ఆడి కరువానాను నిరోధించగలిగిన భారత కుర్రాడు ఆదివారం తెల్ల పావులతో ఆధిక్యం ప్రదర్శించగలిగితే ఫైనల్ చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి.
మరో సెమీస్‌లో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ తన స్థాయిని ప్రదర్శించాడు. స్థానిక ఆటగాడు నిజాత్ అబసోవ్ (అజర్‌బైజాన్)తో జరుగుతున్న ఈ పోరులో తొలి గేమ్‌ను అతను 43 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. శనివారం తన రెండో గేమ్‌ను కార్ల్‌సన్ ‘డ్రా’ చేసుకోగలిగినా ఫైనల్లోకి అడుగు పెడతాడు.