
PC: PKL X
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 12వ సీజన్‌కు ముందు ఆటగాళ్ల వేలం ప్రక్రియను ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబైలో నిర్వహించే ఈ వేలానికి సంబంధించిన సమాచారాన్ని ఇదివరకే 12 ఫ్రాంచైజీ యాజమాన్యాలకు తెలియజేశామని నిర్వాహకులు వెల్లడించారు.
కాగా 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన 11 సీజన్లలో 8 వేర్వేరు జట్లు టైటిళ్లు గెలుపొందడం విశేషం. ఈ నేపథ్యంలో కబడ్డీ లీగ్‌లో పలానా జట్టు ఫేవరెట్ అనే మాటే లేకుండా ప్రతీ జట్టు టైటిల్ కోసం పోరాడుతూనే ఉంది. దీంతో యేటికేడు కబడ్డీ కూతకు ఆదరణ అంతకంతకు పెరుగుతూనే ఉండటం విశేషం.
బెంగాల్ వారియర్స్ కోచ్‌గా నవీన్
ఈ ఏడాది జరిగే 12వ సీజన్ పీకేఎల్ కోసం బెంగాల్ వారియర్స్ తమ జట్టు హెడ్ కోచ్‌గా నవీన్ కుమార్‌ను నియమించింది. ప్రస్తుతం కోచ్‌గానే కాదు... అంతకుముందు ఆటగాడిగాను అతనికి మంచి రికార్డు ఉంది. దక్షిణాసియా క్రీడలు (2006), ఆసియా క్రీడలు (2006), కబడ్డీ ప్రపంచకప్ (2007), ఆసియా ఇండోర్ క్రీడల్లో (2007) భారత్ స్వర్ణాలు గెలిచిన బృందంలో అతను సభ్యుడిగా ఉన్నాడు. కోచ్‌గానూ నిరూపించుకున్నాడు.
గతంలో అతను భారత జాతీయ, దేశవాళీ జట్లకు కోచింగ్ సేవలందించాడు. భారత నేవి, స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) జట్లకు కోచ్‌గా వ్యవహించాడు. ఆటలో కడదాకా కనబరిచే పోరాటస్ఫూర్తి, ఏ దశలోనూ కుంగిపోని సానుకూల దృక్పథం అతన్ని మేటి కోచ్‌గా నిలబెడుతోంది. 12 ఫ్రాంచైజీలు తలపపడిన గత సీజన్‌లో బెంగాల్ పదో స్థానంతో నిరాశపరిచింది.
ఈ నేపథ్యంలో వేలానికి ముందే అతన్ని నియమించుకోవడం ద్వారా సరైన ఆటగాళ్ల కొనుగోలు, జట్టు కూర్పు, పటిష్టమైన దళాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినంత సమయం లభిస్తుందని ఫ్రాంచైజీ యాజమాన్యం భావించింది.
బెంగాల్‌కు కోచింగ్ పట్ల నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారియర్స్‌ను దీటైన జట్టుగా, బరిలో ఎదురులేని ప్రత్యర్థిగా తయారు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నాడు.
చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!