
విండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్‌తో గిల్ కరచాలనం
వెస్టిండీస్‌తో తొలి టెస్టులో గెలుపు పట్ల టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) హర్షం వ్యక్తం చేశాడు. ఇదొక సంపూర్ణ మ్యాచ్ అని.. రెండు ఇన్నింగ్స్‌లో బౌలర్లు రాణించిన తీరు అద్భుతమని కొనియాడాడు. బ్యాటింగ్ పరంగానూ తాము గొప్పగా ఆడామని.. ముగ్గురు సెంచరీలు చేయడం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా టెస్టు సారథిగా గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్నాడు. అయితే, ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు టెస్టుల్లోనూ గిల్ టాస్ ఓడిపోయాడు.
వరుసగా ఆరు ఓటములు
తాజాగా వెస్టిండీస్‌తో తొలి టెస్టు (IND vs WI 1st Test)లోనూ ఇదే రిపీటైంది. అయితే, సారథిగా టాస్ ఓడినా మ్యాచ్‌లు మాత్రం గెలిచాడు గిల్. ఈ నేపథ్యంలో విండీస్‌పై విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘వరుసగా ఆరుసార్లు టాస్ ఓడిపోయాను.
అయితే, మ్యాచ్‌లు మాత్రం గెలుస్తూనే ఉన్నాం. కాబట్టి టాస్‌లో ఓడిన ప్రభావం పడిందని అనుకోను. దానిని అసలు లెక్కేచేయను. ఇదొక సంపూర్ణ మ్యాచ్. విజయం పట్ల సంతోషంగా ఉంది.
ఎలాంటి ఫిర్యాదులూ లేవు
ముగ్గురు సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ భేషుగ్గా ఉంది. ఏ విషయంలోనూ ఎలాంటి ఫిర్యాదులూ లేవు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు బాగానే ఉంది.
అయితే, నేను, జైస్వాల్ మెరుగ్గా ఆడలేకపోయాము. శుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోయాము. ఇక మా స్పిన్నర్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. వారిని రొటేట్ చేసుకోవడమే కష్టం. అయితే, ఇలాంటి సవాలు ఎదురుకావడం జట్టుకు మంచిదే.
కెప్టెన్‌గా చాలా విషయాలు నేర్చుకుంటున్నా
అవసరమైనప్పుడు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి పని పూర్తి చేస్తారు. మా జట్టులో యువకులు ఎక్కువగా ఉన్నారు. కెప్టెన్‌గా నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నా. క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించాలో తెలుసుకుంటున్నా. జట్టుగా మేమంతా ఇప్పటికీ నేర్చుకునే దశలోనే ఉన్నాం.
అనుభవం గడించే కొద్దీ మేము మరింత సానుకూలంగా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలం’’ అని గిల్ చెప్పుకొచ్చాడు. కాగా విండీస్‌తో తొలి టెస్టులో కేఎల్ రాహుల్ (100), ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104- నాటౌట్) సెంచరీలు చేయగా.. గిల్ 50 పరుగులు సాధించాడు.
ఇక బౌలర్లలో పేసర్లు సిరాజ్ ఓవరాల్‌గా ఏడు వికెట్లు తీయగా.. బుమ్రా మూడు వికెట్లు కూల్చాడు. స్పిన్నర్లలో రవీంద్ర జడేజా నాలుగు, కుల్దీప్ యాదవ్ నాలుగు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్టు స్కోర్లు
టీమిండియా: 448/5 డిక్లేర్డ్
వెస్టిండీస్: 162 & 146
ఫలితం: వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.
చదవండి: Rishabh Pant Facts: రిషభ్ పంత్ నెట్‌వర్త్ ఎంతో తెలుసా?