
వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును.. ఇన్నింగ్స్ మీద 140 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సమిష్టిగా రాణించి ముచ్చటగా మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించింది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్‌లో భాగంగా తొలుత ఇంగ్లండ్‌తో తలపడిన టీమిండియా.. ఐదు మ్యాచ్‌లలో రెండు గెలిచి 2-2తో సిరీస్ సమం చేసుకుంది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడుతోంది.
చెలరేగిన భారత బౌలర్లు
ఇందులో భాగంగా తొలుత అహ్మదాబాద్ వేదికగా గురువారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు (IND vs WI 1st Test) మొదలైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. భారత పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ధాటికి టాపార్డర్ కుదేలు కాగా.. మిడిలార్డర్‌లో కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయీ హోప్ (26), జస్టిన్ గ్రీవ్స్ (32) ఓ మోస్తరుగా రాణించారు.
ఈ క్రమంలో 44.1 ఓవర్లలో 162 పరుగులు చేసి వెస్టిండీస్ ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్.. తగ్‌నరైన్ చందర్‌పాల్ (0), అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), రోస్టన్ ఛేజ్ రూపంలో నాలుగు కీలక వికెట్లు దక్కించుకున్నాడు.
మరోవైపు.. బుమ్రా జాన్ కాంప్‌బెల్ (8), జస్టిన్ గ్రీవ్స్ (32), జొహాన్ లేన్ (1) వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్.. షాయీ హోప్ (26), వారికన్ (8) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఖరీ పియరీ (11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
రాహుల్, డీజే, జడ్డూ శతకాలు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 128 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ (100), ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ (50) చేశాడు.
అయితే, శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే భారత్ తమ ఓవర్‌నైట్ స్కోరు 448/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు 286 పరుగుల ఆధిక్యం దక్కింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్ 146 పరుగులకే కుప్పకూలింది.
మరోసారి చెలరేగిన భారత బౌలర్లు
భారత బౌలర్ల విజృంభణ కారణంగా విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుసకట్టారు. సిరాజ్ టీమిండియా తరఫున వికెట్ల వేట మొదలుపెట్టగా.. జడ్డూ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ కూడా తన స్పిన్ మాయాజాలంతో విండీస్‌ను ఆడుకున్నాడు.
ఈ క్రమంలో ఓపెనర్ తగ్‌నరైన్ చందర్‌పాల్ (8) మరోసారి విఫలం కాగా.. జాన్ కాంప్‌బెల్ 14, బ్రాండన్ కింగ్ 5, రోస్టన్ ఛేజ్ 1, షాయీ హోప్ 1 పరుగు చేశారు. వన్‌డౌన్‌బ్యాటర్ అలిక్ అథనాజ్ 38 పరుగులు సాధించగా.. అతడితో కలిసి జస్టిన్ గ్రీవ్స్ (25) కాసేపు పోరాటం చేశాడు.
టీమిండియా ఘన విజయం
ఆఖర్లో ఖరీ పియరీ 13 పరుగులతో అజేయంగా నిలవగా.. బౌలర్ జేడన్ సీల్స్ 22 పరుగులతో సత్తా చాటాడు. అయితే, కుల్దీప్ బౌలింగ్‌లో సీల్స్ పదో వికెట్‌గా వెనుదిరగడంతో విండీస్ పరాజయం ఖరారైంది.
ఇన్నింగ్స్ మీద 140 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జడ్డూ నాలుగు, సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ విజయంతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
భారత్ వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్టు సంక్షిప్త స్కోర్లు
👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
👉టాస్: వెస్టిండీస్.. తొలుత బ్యాటింగ్
👉వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 162 ఆలౌట్
👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/5 డిక్లేర్డ్
✊భారత్‌కు 286 పరుగుల ఆధిక్యం
👉వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్
✌️ఫలితం: వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.
చదవండి: Rishabh Pant Facts: రిషభ్ పంత్ నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
Hugs and smiles all around 😊#TeamIndia celebrate a magnificent victory in Ahmedabad and take a 1-0 lead in the series 👏
Scorecard ▶ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/22q4aUUhqp— BCCI (@BCCI) October 4, 2025