
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) పుట్టిన రోజు నేడు (అక్టోబరు 4). ఈ వికెట్ కీపర్ బ్యాటర్ శనివారం.. 28వ వసంతంలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పంత్‌కు శుభాకాంక్షలు తెలుపగా.. అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ ఆరాధ్య ఆటగాడికి విషెస్ చెబుతున్నారు.
5507 పరుగులు
ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో 1997, అక్టోబరు 4న రాజేంద్ర పంత్- సరోజ్ పంత్ దంపతులకు రిషభ్ పంత్ జన్మించాడు. 2016 ఇండియా అండర్-19 జట్టు తరఫున వరల్డ్‌కప్‌లో సత్తా చాటి వెలుగులోకి వచ్చిన పంత్.. 2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.
అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 154 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 5507 పరుగులు సాధించాడు. అంతేకాదు.. వికెట్ కీపర్‌గానూ 250 డిస్మిసల్స్‌లోనూ భాగమయ్యాడు.
పడిలేచిన కెరటం
దిగ్గజ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా నీరాజనాలు అందుకున్న పంత్.. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి. అయితే, 2022లో జరిగిన ఘోర కారు ప్రమాదం అతడి కెరీర్‌నే ప్రశ్నార్థకం చేసింది.
కొత్త సంవత్సరం వేడుకల కోసం ఢిల్లీ నుంచి స్వస్థలానికి వెళ్తున్న సమయంలో పంత్ ప్రయాణిస్తున్న కారు.. డివైడర్‌ను ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. ఈ క్రమంలో మంటలు చెలరేగగా.. అదృష్టవశాత్తూ పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు.
బీసీసీఐ చొరవ తీసుకుని పంత్‌ను ఉత్తరాఖండ్ నుంచి ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేయించి.. మెరుగైన చికిత్స అందించింది. ఈ క్రమంలో దాదాపు ఏడాది ఆటకు దూరమైన పంత్.. 2024లో ఐపీఎల్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.
పునరాగమనంలో ఆకాశమే హద్దుగా
ఇక పునరాగమనంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఏకంగా రూ. 27 కోట్ల (లక్నో సూపర్ జెయింట్స్)కు అమ్ముడుపోయి లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచాడు.
కాగా టీమిండియా తరఫున టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన జట్లలో పంత్.. సభ్యుడిగా తన వంతు పాత్ర పోషించాడు.
నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో పంత్ A గ్రేడ్‌లో ఉన్నాడు. కాబట్టి.. బోర్డు ద్వారా పంత్‌కు ఏడాదికి రూ. 5 కోట్ల వేతనం అందుతుంది. ఇక ఇందుకు అదనంగా.. ఆడే ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అతడికి దక్కుతాయి.
ఇక ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు రూ. 27 కోట్లకు అమ్ముడుపోయిన పంత్.. ఐపీఎల్ సాలరీ అంతకు ముందు కూడా తక్కువేమీ కాదు. ఇటు టీమిండియా తరఫున.. అటు ఐపీఎల్‌లో భారీ వేతనాలు పొందతున్న పంత్.. అడిడాస్, జొమాటో, క్యాడ్‌బరీ వంటి పలు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగానూ ఉన్నాడు.
ఒక్కో ఎండార్స్‌మెంట్ డీల్‌కు పంత్ రూ. 3.5 నుంచి 4 కోట్ల వరకు వసూలు చేస్తాడని వన్‌క్రికెట్ గతంలో వెల్లడించింది. ప్రచారకర్తగా ఏడాదికి రూ. 20- 25 కోట్ల వరకూ సంపాదిస్తున్నాడని వెల్లడించింది.
ఇక పంత్‌కు రూర్కీలో రూ. 1 కోటి విలువైన స్థిరాస్థి ఉన్నట్లు సమాచారం. అదే విధంగా ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో రూ. 2 కోట్ల విలువైన ఇల్లు అతడి పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది.
లగ్జరీ కార్లు
పంత్ గ్యారేజ్‌లో ఆడిఏ8, ఫోర్డ్ ముస్తాంగ్ జీటీ, మెర్సిడెస్-బెంజ్ ఎస్‌యూవీ, మెర్సిడెజ్ బెంజ్ జీఎల్‌ఈ వంటి పలు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. వన్‌క్రికెట్ వివరాల ప్రకారం.. 2025 నాటికి పంత్ నికర ఆస్తుల విలువ వంద కోట్లు అని అంచనా.
ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడిన పంత్.. టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. అక్టోబరులో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా..