
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ అదేమిటంటే...!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా టీమిండియా- విండీస్ (IND vs WI Tests) మధ్య రెండు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలైంది.
శతక్కొట్టిన కేఎల్ రాహుల్
నరేంద్ర మోదీ మైదానంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి.. కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 448 పరుగులు సాధించింది.
I wish KL Rahul does what Michael Hussey has done in his career,KL hits his prime in 30s and wants him to score at least 10k test runs for india otherwise it's a waste of talent.
India has done a lot of backing, now it's finally paying off.pic.twitter.com/JokYjzK6Lt— Sujeet Suman (@sujeetsuman1991) October 3, 2025
ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (36) ఫర్వాలేదనిపించగా... రెండో రోజు ఆట సందర్భంగా కేఎల్ రాహుల్ శతక్కొట్టాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 197 బంతులు ఎదుర్కొని 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే.. వారికన్ బౌలింగ్‌లో జస్టిన్ గ్రీవ్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో రాహుల్ శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఏకైక క్రికెటర్‌గా..
కాగా టెస్టు మ్యాచ్‌లో రాహుల్ ఇలా సరిగ్గా వంద పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత అవుట్ కావడం ఇది రెండోసారి. జూలైలో ఇంగ్లండ్‌తో లార్డ్స్ టెస్టులోనూ సెంచరీ చేసిన తర్వాత రాహుల్ పెవిలియన్ చేరాడు. ఇలా ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఓ ఆటగాడు సరిగ్గా వంద పరుగులు చేసి రెండుసార్లు అవుట్ కావడం.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
అదే విధంగా.. ఓవరాల్‌గా టెస్టు కెరీర్‌లో 100 పరుగుల వద్ద రెండుసార్లు అవుటైన ఏడో ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ నిలవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రాహుల్ కెరీర్‌లో ఇది పదకొండో టెస్టు సెంచరీ కావడం విశేషం.
448/5 డిక్లేర్డ్
ఇక రాహుల్ (100)తో పాటు ధ్రువ్ జురెల్ (125) శతక్కొట్టగా.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అజేయ సెంచరీ (104)తో క్రీజులో ఉన్నాడు. మిగిలిన వాళ్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అర్ధ శతకం (100 బంతుల్లో 50) సాధించాడు.
ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి 448 పరుగులు చేసిన టీమిండియా.. విండీస్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే ఇదే స్కోరు వద్ద (448/5) టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
చదవండి: IND vs AUS: శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ విఫలం.. తిలక్ వర్మ మెరిసినా...