
తిలక్ వర్మ (పాత ఫొటో)
ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత ‘ఎ’ (IND A vs AUS A) జట్టు పరాజయం పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో... శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సారథ్యంలోని భారత ‘ఎ’జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 9 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో సిరీస్ 1–1తో సమమైంది.
246 పరుగులకు ఆలౌట్
కాన్పూర్ వేదికగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ జట్టు 45.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. ఇటీవల ఆసియాకప్ టీ20 టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్తాన్‌పై అజేయ అర్ధశతంతో మెరిసి జట్టును గెలిపించిన తిలక్ వర్మ (Tilak Varma) మరోసారి ఆకట్టుకున్నాడు.
త్రుటిలో చేజారిన శతకం
తాజా మ్యాచ్‌లో తిలక్ 122 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94 పరుగులు చేసి త్రుటిలో శతకం కోల్పోయాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న తిలక్ వర్మ... ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లోనూ సత్తా చాటాడు.
రియాన్ పరాగ్ (54 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు. రియాన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు తిలక్ 101 పరుగులు జతచేశాడు. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన ఈ హైదరాబాద్ బ్యాటర్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ విఫలం
ఇక తొలి మ్యాచ్‌లో సెంచరీలతో మెరిసిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ (1), శ్రేయస్ అయ్యర్ (8)తో పాటు... అభిషేక్ శర్మ (0), నిశాంత్ (1) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆ్రస్టేలియా లక్ష్యఛేదన ప్రారంభించాక భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోగా... ఆసీస్ లక్ష్యాన్ని 25 ఓవర్లలో 160గా నిర్ణయించారు.
సిరీస్ సమం
ఛేదనలో ఆసీస్ 16.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 160 పరుగులు చేసి గెలిచింది. మెకంజీ హార్వే (49 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూపర్ (31 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధశతకాలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
భారత బౌలర్లలో నిషాంత్ ఒక వికెట్ పడగొట్టాడు. టీమిండియా పేసర్ అర్శ్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్నాడు. ఇరు జట్ల మధ్య ఆదివారం నిర్ణయాత్మక మూడో మ్యాచ్ జరగనుంది.
చదవండి: ఆసియాకప్ ట్రోఫీని భారత్‌కు ఇవ్వొద్దు.. ఆ మొండితనం ఏంటి?: పాక్ మాజీ క్రికెటర్