‘అతను లేకపోవడం వల్లే ఈ వైఫల్యం’

Pakistan Needed To Play Wahab Riaz, Shahid Afridi - Sakshi

బౌలింగ్‌లో విఫలం.. అందుకే ఈ మూల్యం

పాక్‌ ఓటమిపై  అఫ్రిది అసంతృప్తి

కరాచీ: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓటమి పాలు కావడంపై ఆ జట్టు మాజీ ఆల్‌ రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోవడానికి బౌలింగ్‌లో వైఫల్యమే కారణమన్నాడు. పాకిస్తాన్‌ బ్యాటింగ్‌లో ఉన్న పస బౌలింగ్‌లో లేకపోవడం వల్లే పరాజయం చవిచూడాల్సి వచ్చిందన్నాడు. వహాబ్‌ రియాజ్‌ వంటి అనుభవం ఉన్న పేసర్‌ అందుబాటులో ఉన్నా తుది జట్టులో వేసుకోకపోవడం కూడా పాక్‌ ఓటమికి ఒక కారణమన్నాడు. (చదవండి: సీఎస్‌కే చేసిన పొరపాటు అదేనా?)

‘ ఇంగ్లండ్‌తో రెండో టీ20లో ఫలితం చూసి చాలా నిరాశ చెందా. మనం మంచి స్కోరు చేశాం.. కానీ బౌలింగ్‌ విభాగం వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్నాం. ఆ సమయంలో రియాజ్‌ ఎందుకు లేకుండా పోయాడని చాలా ఫీల్‌ అయ్యా. అప్పుడు రియాజ్‌ ఉండి ఉంటి అతని అనుభవం జట్టుకు ఉపయోగపడేది. పాకిస్తాన్‌ అధీనంలో ఉండాల్సిన మ్యాచ్‌ చేజాతులా కోల్పోయాం. ఏది ఏమైనా ఈ ఫలితం చాలా చాలా నిరూత్సాహపరిచింది. రియాజ్‌ను ఆడించాల్సిన అవసరం ఉంది’ అని అఫ్రిది పేర్కొన్నాడు.

మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నాలుగు వికెట్లకు 195 పరుగులు చేసింది. కాగా, చివరకు ఇంగ్లండ్‌నే విజయం వరించింది. పాకిస్తాన్‌ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి తోడు మలాన్‌ 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 54 పరుగులు సాధించడంతో పాటు బెయిర్‌ స్టో 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44 పరుగులు సాధించాడు. దాంతో ఇంగ్లండ్‌ ఐదు బంతులు ఉండగా ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దాంతో సిరీస్‌లో ఇంగ్లండ్‌కు 1-0 ఆధిక్యం లభించింది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా, మూడో టీ20 రేపు జరుగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top