
పాకిస్తాన్ యువ క్రికెటర్ హైదర్ అలీపై ఇంగ్లండ్‌లో అత్యాచార ఆరోపణల కేసు నమోదైంది. ఈ కేసులో అతన్ని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతను బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ కేసు విషయం తెలిసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) హైదర్ అలీని సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించింది.
ఓ యువతి ఫిర్యాదు మేరకు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు హైదర్ అలీని ఈ నెల 3వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను పాకిస్తాన్-ఏ (షాహీన్స్) తరఫున బెకెన్హెయిమ్‌లో ఇంగ్లండ్-ఏ జట్టుతో వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. గత ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగిందని పీసీబీ ప్రకటించింది.
పోలీసుల ప్రాథమిక విచారణ సందర్భంగా హైదర్ అలీ కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తాను నిర్దోషినంటూ వాదించినట్లు సమాచారం. 24 ఏళ్ల హైదర్ అలీ పాక్ జాతీయ జట్టు తరఫున ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. అతను పాక్ తరఫున 35 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. ఇందులో 3 అర్ద సెంచరీల సాయంతో 547 పరుగులు చేశాడు. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన హైదర్ అలీ 2020లో పాక్ తరఫున అరంగేట్రం చేశాడు.
కాగా, పాక్ క్రికెటర్లకు ఇంగ్లండ్‌లో వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. గతంలో సల్మాన్ బట్, మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్ లైంగిక వేధింపులు సహా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. హైదర్ అలీ విషయంలో పాక్ క్రికెట్ పైకి హుందాగా ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ, లోలోపల తమ దేశ క్రికెటర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. హైదర్‌కు కావాల్సిన లీగల్ సపోర్ట్‌కు పీసీబీనే సమకూర్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే, పాక్ క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో పాక్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఇవాళ (ఆగస్ట్ 8) ఆ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఆడనుంది.