పాక్‌ బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ఇంగ్లండ్‌ | Women's CWC 2025: Bowlers Shine, Pakistan Target 113 Runs | Sakshi
Sakshi News home page

పాక్‌ బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ఇంగ్లండ్‌

Oct 15 2025 9:24 PM | Updated on Oct 15 2025 9:25 PM

Women's CWC 2025: Bowlers Shine, Pakistan Target 113 Runs

మహిళల వ‍న్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 15) జరుగుతున్న మ్యాచ్‌లో (Pakistan vs England) పాకిస్తాన్‌ బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం​ కారణంగా 31 ఓవర్లకు కుదించబడిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను కేవలం 133 పరుగులకే పరిమితం చేశారు. 

ఓ దశలో పాక్‌ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌ 100 పరుగులు కూడా చేయలేని పరిస్థితిలో ఉండింది. 25 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్‌ స్కోర్‌ 7 వికెట్ల నష్టానికి 79 పరుగులుగా ఉండింది. ఈ దశలో వర్షం​ మొదలైంది.

సుదీర్ఘ విరామం తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్‌ను 31 ఓవర్లకు కుదించారు. మ్యాచ్‌ పునఃప్రారంభమయ్యాక ఇంగ్లండ్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. అప్పటిదాకా ఒక్కో పరుగు చేసేందుకు ఇబ్బందిపడ్డ వారు, చివరి 6 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు సాధించారు. 

తొలి 25 ఓవర్లలో పాక్‌ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 150 బంతుల్లో ఏకంగా 117 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. పైగా స్వల్ప విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించారు.

కెప్టెన్‌ ఫాతిమా సనా 6 ఓవర్లలో కేవలం​ 27 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. సదియా ఇక్బాల్‌ 6 ఓవర్లలో 12 పరుగులకు 2 వికెట్లు పడగొట్టింది. డయానా బేగ్‌, రమీన్‌ షమీమ్‌ తలో వికెట్‌ తీశారు. నష్రా సంధు వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా (7-2-12-0) బౌలింగ్‌ చేసింది.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్‌ ప్లేయర్‌ ఛార్లీ డీన్‌ (33) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఎమ్‌ ఆర్లాట్‌ (18), హీథర్‌ నైట్‌ (18), అలైస్‌ క్యాప్సీ (16), సోఫీ డంక్లీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఓటమి ఎరుగని ఇంగ్లండ్‌ నుంచి ఇది అత్యంత ఘోరమైన ప్రదర్శన. 

ఈ టోర్నీలో ఇంగ్లండ్‌ సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. పాక్‌ విషయానికొస్తే.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదర్కొని చిట్టచివరి స్థానంలో కొనసాగుతుంది.

కాగా, వర్షం​ కారణంగా పాకిస్తాన్‌ లక్ష్యాన్ని కుదించారు. 31 ఓవర్లలో ఆ జట్టు టార్గెట్‌ 113 పరుగులుగా నిర్దేశించారు. 

చదవండి: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణ హక్కులను దక్కించుకున్న భారత్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement