Asia Cup 2022 PAK VS AFG: ఆఫ్ఘన్‌ బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టబోయిన పాక్‌ బ్యాటర్‌.. వైరల్‌ వీడియో

Pakistan Asif Ali Almost Hits Afghanistan Bowler Fareed Malik During Asia Cup Super 4 Clash - Sakshi

ఆసియా కప్‌ 2022 సూపర్‌-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 7) ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో పాకిస్తాన్‌ వికెట్‌ తేడాతో గట్టెక్కింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో పాక్‌ పదో నంబర్‌ ఆటగాడు నసీమ్‌ షా.. ఆఖరి ఓవర్‌ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి పాక్‌కు అపురూప విజయాన్ని అందించాడు. అప్పటివరకు ఆఫ్ఘన్‌ చేతుల్లోనే ఉన్న మ్యాచ్‌ (6 బంతుల్లో 11 పరుగులు).. నసీమ్‌ వీర విజృంభణ ధాటికి పాక్‌ వశమైంది.

అయితే అంతకుముందు ఓవర్లో చోటు చేసుకున్న ఓ దురదృష్టకర ఘటన క్రికెట్‌ ప్రేమికులను విస్మయాన్ని గురి చేసింది. 19వ ఓవర్ నాలుగో బంతికి సిక్సర్‌ బాది జోరుమీదున్న పాక్‌ బ్యాటర్‌ ఆసిఫ్‌ అలీ..  ఆ తర్వాతి బంతికే ఔటయ్యానన్న కోపంతో ఆఫ్ఘన్‌ బౌలర్‌ ఫరీద్‌ అహ్మద్‌ను బ్యాట్‌తో కొట్టబోయాడు. ఇందులో ఫరీద్‌ తప్పు కూడా ఉంది. ఆసిఫ్‌ను ఔట్‌ చేశానన్న ఆనందంలో ఫరీద్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించాడు.

దీంతో కోపం ఆపుకోలేక పోయిన ఆసిఫ్‌ అలీ.. ఫరీద్‌పై బ్యాట్‌తో దాడి చేయబోయాడు. పెవిలియన్‌ వైపు వెళ్తూవెళ్తూ ఫరీద్‌కు కూడా వార్నింగ్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో క్షణాల్లో వైరలైంది. క్రికెట్‌ అభిమానులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. పాక్‌ ఆటగాడి ఓవరాక్షన్‌పై మండిపడుతున్నారు. క్రికెట్‌లో వికెట్‌ తీశాక సంబురాలు చేసుకోవడం కామనేనని, దానికి ఆసిఫ్‌ అంతలా రియాక్ట్‌ అవ్వాల్సిన అవసరం లేదని దండిస్తున్నారు. భౌతిక దాడులకు పాల్పడటం అనేది జెంటిల్మెన్‌ గేమ్‌ సంస్కృతి కాదని హితవు పలుకుతున్నారు. మరికొందరైతే పాక్‌ ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలిన ఐసీసీని కోరుతున్నారు. 

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. పాక్‌ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35  పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్‌ ఆఫ్ఘన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌కు ఆఫ్గన్‌ బౌలర్లు చుక్కలు చూపించారు.

పొదుపుగా బౌలింగ్‌ చేయటంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీసి పాక్‌పై ఒత్తిడి పెంచారు. అయితే చివర్లో షాదాబ్‌ ఖాన్‌ (26 బంతుల్లో 36; ఫోర్‌, 3 సిక్సర్లు), ఆసిఫ్‌ అలీ (8 బంతుల్లో 16; 2 సిక్సర్లు), నసీమ్‌ షా (4 బంతుల్లో 14 నాటౌట్‌; 2 సిక్సర్లు) భారీ సిక్సర్లు బాది ఆఫ్ఘన్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఆఫ్ఘన్‌ బౌలర్లు ఫజల్‌ హక్‌ ఫారూఖీ (3/31), ఫరీద్‌ మాలిక్‌ (3/31), రషీద్‌ ఖాన్‌ (2/25) చెలరేగినప్పటికీ నసీమ్‌ షా వరుస సిక్సర్లతో పాక్‌ను గెలిపించాడు. ఈ దెబ్బతో ఆఫ్ఘన్‌ సహా భారత్‌ కూడా ఇంటిముఖం పట్టింది. సెప్టెంబర్‌ 11న జరిగే ఫైనల్లో పాక్‌-శ్రీలంక జట్లు తలపడతాయి. 
చదవండి: Viral Video: ఆఫ్ఘన్‌ ఫ్యాన్స్‌ క్రూర ప్రవర్తన.. పాక్‌ అభిమానులపై దాడులు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top