Rehan Ahmed: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ బౌలర్‌

PAK VS ENG: Rehan Ahmed Becomes Youngest Debutant To Claim 5 Wickets In Tests - Sakshi

PAK VS ENG 3rd Test Day 3: కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ యువ స్పిన్నర్‌ రెహాన్‌ అహ్మద్‌ చరిత్ర సృష్టించాడు. పురుషుల క్రికెట్‌లో అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టిన 18 ఏళ్ల 126 రోజుల వయసున్న రెహాన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 14.5 ఓవర్లలో 48 పరుగులిచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

గతంలో ఈ రికార్డు ఆసీస్‌ టెస్ట్‌ జట్టు సారధి పాట్‌ కమిన్స్‌ పేరిట ఉండేది. కమిన్స్‌ 18 ఏళ్ల 196 రోజుల వయసులో టెస్ట్‌ల్లో (అరంగేట్రం మ్యాచ్‌) 5 వికెట్ల ఘనత సాధించాడు. తాజాగా రెహాన్‌.. చాలాకలంగా పదిలంగా ఉండిన కమిన్స్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే మ్యాచ్‌లో రెహాన్‌ ఈ రికార్డుతో పాటు మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు.

ఇంగ్లండ్‌ తరఫున అత్యంత పిన్న వయసులో టెస్ట్‌ అరంగేట్రం చేసిన ఆటగాడిగా రెహాన్‌ చరిత్ర సృష్టించాడు. రెహాన్‌కు ముందు ఈ రికార్డు బ్రియాన్‌ క్లోజ్‌ పేరిట ఉండేది. క్లోజ్‌.. 1949లో 18 ఏళ్ల 149 రోజుల వయసులో టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెగ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన రెహాన్‌ పాకిస్తాన్‌ సంతతికి చెందిన వాడు. 

రెహాన్‌ తండ్రి నయీమ్‌ అహ్మద్‌ పాకిస్తాన్‌లో జన్మించి, ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. రెహాన్‌, అతని సోదరులు ఫర్హాన్‌, రహీమ్‌లు కూడా క్రికెటర్లే కావడం విశేషం. ఇంగ్లండ్‌ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న రెహాన్‌.. తన తండ్రి పుట్టిన దేశంపైనే విశ్వరూపం ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. 

ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ విజయం దిశగా సాగుతోంది. 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు నెగ్గిన ఇంగ్లండ్‌.. మరో 55 పరుగులు చేస్తే మూడో టెస్ట్‌లోనూ విజయం సాధించి పాకిస్తాన్‌ను వారి స్వదేశంలో క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది. 

రెహాన్‌ ధాటికి పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌటై, ప్రత్యర్ధి ముందు167 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసి విజయానికి అతి సమీపంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో పాటు చేతిలో 8 వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్‌ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top