టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే! | Not Shreyas Ravi Shastri Picks This Player Replace SKY T20I Captain | Sakshi
Sakshi News home page

టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే!

May 15 2026 12:56 PM | Updated on May 15 2026 1:10 PM

Not Shreyas Ravi Shastri Picks This Player Replace SKY T20I Captain

టీమిండియా టీ20 కెప్టెన్సీ త్వరలోనే చేతులు మారనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్‌కు ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ అందించినప్పటికీ సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా పేరొందిన ఈ ముంబైకర్‌.. ఇటీవల ఫామ్‌లేమితో ఇబ్బంది పడటం ఇందుకు కారణం.

కొత్త సారథి రావడం పక్కా!
అంతేకాదు 35 ఏళ్ల సూర్యకు వయసు కూడా అడ్డంకిగా మారింది. ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత అతడిని తొలగించి.. కొత్త సారథిని నియమించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌ పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది.

ప్రస్తుతం భారత టీ20 జట్టులో అయ్యర్‌కు చోటు లేకపోయినా.. త్వరలోనే అతడు రీఎంట్రీ ఇచ్చి పగ్గాలు చేపడతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతడితో పాటు ఇషాన్‌ కిషన్‌, టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంజూకే ఆ అర్హత
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌, భారత మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌-2028 టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో టీమిండియా కొత్త కెప్టెన్‌ కోసం ఎదురుచూస్తోంది. ఈ రెండేళ్లలో సూర్య ఏం చేస్తాడో చూడాలి.

అయితే, సూర్య స్థానంలో కొత్త నాయకుడిగా సంజూ శాంసన్‌ ముందు వరుసలో ఉంటాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా అతడు అదరగొట్టాడు. టాపార్డర్‌లో విధ్వంసకర బ్యాటర్‌గా అతడు పేరొందాడు. వచ్చే రెండు, మూడేళ్లలో సంజూ నుంచి మనం మరిన్ని గొప్ప ఇన్నింగ్స్‌ చూడబోతున్నామని అనిపిస్తోంది.

నిజానికి సంజూ గొప్ప ప్రతిభ ఉన్న ఆటగాడు. అయితే, తనకున్న టాలెంట్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాడనే విమర్శలు వచ్చేవి. టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా వాటన్నింటికీ అతడు ఆటతోనే సమాధానం చెప్పాడు.

ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు
కీలక నాకౌట్‌ మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. భారత్‌ మరోసారి టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లలో సంజూ గొప్ప పరిణతితో కూడిన ఇన్నింగ్స్‌ ఆడాడు.

తాజా సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫునా రాణిస్తున్నాడు. టీమిండియా భవిష్య నాయకుడిగా సంజూ తనను తాను ముందు వరుసలో నిలుపుకొన్నాడు’’ అని రవిశాస్త్రి ‘ది ఐసీసీ రివ్యూ’లో పేర్కొన్నాడు.

దుమ్ములేపిన సంజూ
కాగా టీ20 ప్రపంచకప్‌-2026లో నాకౌట్‌ మ్యాచ్‌లలో సంజూ 97*, 89, 89 పరుగులు సాధించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’ అవార్డు గెలుచుకున్నాడు.

ఇక ఐపీఎల్‌-2026 ఆరంభానికి ముందు రాజస్తాన్‌ నుంచి చెన్నైకి ట్రేడ్‌ అయిన సంజూ.. ఆరంభంలో తడబడ్డాడు. ఆ తర్వాత సెంచరీతో అదరగొట్టి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పటికి 11 మ్యాచ్‌లలో కలిపి 430 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి.

చదవండి: Hardik Pandya: మౌనం వీడిన ముంబై ఇండియన్స్‌

Advertisement
 
Advertisement
Advertisement