మౌనం వీడిన ముంబై ఇండియన్స్‌ | MI Finally Reveal Full Story Of Hardik Pandya Continued Absence | Sakshi
Sakshi News home page

Hardik Pandya: మౌనం వీడిన ముంబై ఇండియన్స్‌

May 15 2026 10:49 AM | Updated on May 15 2026 12:02 PM

MI Finally Reveal Full Story Of Hardik Pandya Continued Absence

హార్దిక్‌ పాండ్యా (PC: MI/BCCI)

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై వేటు తప్పదంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సారథిగా, ఆల్‌రౌండర్‌గా విఫలమవుతున్న హార్దిక్‌ను వదిలించుకోవాలని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదే సమయంలో హార్దిక్‌ (Hardik Pandya) సైతం మేనేజ్‌మెంట్‌ వైఖరి పట్ల గుర్రుగా ఉన్నాడని.. జట్టును వీడేందుకు సిద్ధపడ్డాడనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా వరుసగా నాలుగో మ్యాచ్‌కు దూరం కావడం వీటికి బలాన్నిచ్చింది.

ఐపీఎల్‌-2026లో భాగంగా గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌కు కూడా పాండ్యా అందుబాటులోకి రాలేదు. దీంతో అతడి స్థానంలో ఈసారి జస్‌ప్రీత్‌ బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక లీగ్‌ దశలో ముంబైకి మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే, ఇప్పుడైనా హార్దిక్‌ జట్టుతో కలుస్తాడా? లేదా? అన్నది ప్రశ్నార్థంగా మారింది.

స్పందించిన ముంబై స్టార్‌
ఈ నేపథ్యంలో ముంబై ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ హార్దిక్‌ పాండ్యా గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ‘‘హార్దిక్‌ గాయపడ్డాడు. ఆర్సీబీతో మే 10 నాటి మ్యాచ్‌ కోసం అతడు రాయ్‌పూర్‌కి వచ్చాడు. కానీ వెన్నునొప్పి కారణంగా ఆడలేకపోయాడు.

అతడు ముంబైలో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. కేకేఆర్‌తో బుధవారం నాటి మ్యాచ్‌ కోసం హార్దిక్‌ కోల్‌కతాకు వస్తాడని నేను విశ్వసిస్తున్నా. హార్దిక్‌ లాంటి ఆటగాళ్లు జట్టుకు దూరం కావడం ప్రభావం చూపుతుంది. ఇక సోషల్‌ మీడియాలో వదంతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.

యాజమాన్యానిదే అంతిమ నిర్ణయం
అందులో కొన్ని నిజాలు, మరికొన్ని అబద్ధాలు ఉంటాయి. జట్టు యాజమాన్యానిదే అంతిమ నిర్ణయం. అతడు గాయపడ్డాడు కాబట్టే జట్టుతో ప్రయాణించడం లేదు. అంతకు మించి ఏమీలేదు’’ అని శార్దూల్‌ ఠాకూర్‌ పేర్కొన్నాడు.

కాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో శార్దూల్‌ ఠాకూర్‌.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 39 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. తద్వారా ముంబై గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. 

మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ధర్మశాల వేదికగా పంజాబ్‌పై ముంబై ఆరు వికెట్ల తేడాతో గెలిచి.. సీజన్‌లో నాలుగో విజయం అందుకుంది.

చదవండి: IPL 2026: తిలక్‌ వర్మ విధ్వంసం.. పంజాబ్‌పై ముంబై ఘన విజయం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement