ఐపీఎల్-2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ మరోసారి 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. గురువారం ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. పంజాబ్ విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది.
ఈ ఓటమితో పంజాబ్ తమ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి. ఇక ముంబై విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. ఈ హైదరాబాదీ కేవలం 33 బంతుల్లో 75 పరుగులు చేసి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి.
ఆఖరిలో విల్ జాక్స్(10 బంతుల్లో 25) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరితో పాటు ర్యాన్ రికెల్టన్(48) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఓమర్జాయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. చాహల్, జాన్సన్ తలా వికెట్ సాధించారు.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓమర్జాయ్(17 బంతుల్లో 38), బార్ట్‌లెట్(7 బంతుల్లో 18), ప్రియాన్ష్ ఆర్య(22) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్ రెండు, బాష్, బావా తలా వికెట్ సాధించారు.


