నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం.. విండీస్‌ కెప్టెన్సీకి గుడ్‌బై

Nicholas Pooran resigns as West Indies white ball captain  - Sakshi

వెస్టిండీస్‌ కెప్టెన్‌ నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విండీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకు రాజీనామా చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ విండీస్‌ కెప్టెన్సీ పూరన్‌ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్‌ మీడియా వేదికగా వెళ్లడించాడు. కాగా ఈ ఏడాది కిరాన్‌ పోలార్డ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవడంతో పూరన్‌ విండీస్‌ సారధిగా ఎంపికయ్యాడు.

కెప్టెన్‌గా ఎంపికైన పూరన్‌ జట్టును విజయ పథంలో నడిపించలేకపోయాడు. అంతేకాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా తీవ్ర నిరాశపరిచాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ వంటి పసికూన చేతిలో ఓడి అవమానకర రీతిలో టోర్నీ నుంచి విండీస్‌ నిష్క్రమించింది. " టీ20 ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శన నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది.

అప్పటి నుంచి కెప్టెన్సీ గురించి చాలా ఆలోచించాను. ఆఖరికి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కాగా విండీస్‌ కెప్టెన్సీ బాధ్యతలను అంకితభావంతో స్వీకరించాను. నేను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనప్పటినుంచి జట్టుకు నా వంతు కృషిచేశాను. కానీ ప్రపంచకప్‌లో మాత్రం అన్ని విభాగాల్లో విఫలమయ్యాం.

మాకు మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆడేందుకు చాలా సమయం ఉంది. వచ్చే ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు మేము పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతాము" అని పూరన్‌ పేర్కొన్నాడు. అతడు 15 వన్డేలు, 15 టీ20ల్లో విండీస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కేవలం నాలుగు వన్డేలు, నాలుగు టీ20ల్లోనే కెప్టెన్‌గా పూరన్‌ విజయవంతమయ్యాడు. కాగా విండీస్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్న పావెల్‌ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

చదవండి: IND vs NZ: గెలిస్తే... సిరీస్‌ మన చేతికి.. సంజూ సామ్సన్‌, యువ పేసర్‌కు అవకాశం?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top