ప్రపంచకప్ నుంచి బ్రెజిల్ నిష్క్రమణతో భావోద్వేగ నిర్ణయం
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం నెయ్‌మార్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఫిఫా ప్రపంచకప్-2026 రౌండ్ ఆఫ్-16లో నార్వే చేతిలో తన జట్టు ఓటమి (1-2) అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచకప్ నుంచి తన జట్టు నిష్క్రమించాక తీవ్ర భావోద్వేగానికి లోనైన నెయ్‌మార్.. "ఎంతో ప్రయత్నించాను.. కానీ ఇప్పుడు అంతా ముగిసిపోయింది. ఇక్కడే నా ప్రయాణం ప్రారంభమైంది... ఇక్కడే ముగిసింది" అంటూ ఆటకు వీడ్కోలు ప్రకటించాడు.
16 ఏళ్ల ప్రయాణానికి ముగింపు
34 ఏళ్ల నెయ్‌మార్ 2010లో అమెరికాతో జరిగిన మ్యాచ్ ద్వారా బ్రెజిల్ సీనియర్ జట్టులో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ కూడా న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలోనే జరిగింది. అదే వేదికపై నెయ్‌మార్ 16 సంవత్సరాల తర్వాత తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి జాతీయ జట్టుకు వీడ్కోలు పలకడం విశేషం.
కల చెదిరింది
బ్రెజిల్ ఆరో ప్రపంచకప్ టైటిల్ సాధిస్తుందనే భారీ అంచనాల మధ్య నాకౌట్ దశలోకి అడుగుపెట్టింది. అయితే నార్వే సంచలన ప్రదర్శనతో బ్రెజిల్ ఆశలను ఆవిరి చేసింది.
ఈ మ్యాచ్‌లో నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ రెండు గోల్స్ చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. స్టాపేజ్ టైమ్‌లో నెయ్‌మార్ పెనాల్టీ ద్వారా బ్రెజిల్‌కు ఏకైక గోల్ అందించినప్పటికీ, అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది.
గాయాలు వెంటాడినా జట్టును ముందుండి నడిపించాడు
గత కొన్ని సంవత్సరాలుగా నెయ్‌మార్ గాయాల కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయినప్పటికీ 2026 ప్రపంచకప్‌ను గెలవాలనే లక్ష్యంతో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇదే తనకు ప్రపంచకప్ గెలిచే చివరి అవకాశం అని భావించిన నెయ్‌మార్‌కు ఈ ఓటమి మరింత బాధ కలిగించింది.
బ్రెజిల్ ఫుట్‌బాల్‌పై చెరగని ముద్ర
నెయ్‌మార్ డ సిల్వ శాంటోస్ జూనియర్ అలియాస్ నెయ్‌మార్ జూనియర్ బ్రెజిల్ ఫుట్‌బాల్‌పై చెరగని ముద్ర వేశాడు. ఆ దేశం తరఫున అతడు అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. నెయ్‌మార్ బ్రెజిల్ తరఫున 129 మ్యాచ్‌లు ఆడి 80 గోల్స్ నమోదు చేశాడు. అధికారిక గణాంకాల ప్రకారం నెయ్‌మార్ ఆ దేశ దిగ్గజం పీలేను కూడా అధిగమించాడు.
నాలుగు ప్రపంచకప్‌లలో బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహించిన నెయ్‌మార్, ప్రతి తరం జట్టుకు ప్రధాన ఆశాకిరణంగా నిలిచాడు. అయితే ప్రపంచకప్ ట్రోఫీ మాత్రం అతనికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
ప్రపంచకప్ లేకపోయినా ఘనమైన కెరీర్
నెయ్‌మార్ ప్రపంచకప్ ట్రోఫీ సాధించలేకపోయినా బ్రెజిల్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 2013 కాన్ఫెడరేషన్స్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, 2016 రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్‌కు చారిత్రాత్మక తొలి ఒలింపిక్ స్వర్ణ పతకం అందించాడు.


