టపాటపా వికెట్లు పడ్డాయి.. కానీ

New Zealand vs West Indies T20 Target 176 Runs For NZ Team - Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌- వెస్టిండీస్‌ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నేడు ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌కు ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్ మైదానం వేదికైంది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కివీస్‌ జట్టు, విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, వర్షం కారణంగా మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. ఇక ఆరంభంలో తడబడినా కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్ ‌, ఫాబియన్‌ అలెన్‌ దూకుడుగా ఆడటంతో విండీస్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి, 180 పరుగులు చేసింది.  59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ ఈ జోడీ 84 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరు సాధించింది. ఇక మ్యాచ్‌ను కుదించిన కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధన ప్రకారం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ప్రస్తుతం బ్యాటింగ్‌ చేస్తోంది. 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.(చదవండి: జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకోండి: అక్తర్‌ ఫైర్‌)

టపాటపా వికెట్లు.. కానీ
ఆండ్రూ ఫ్లెచర్‌, బ్రాండన్‌ కింగ్‌ వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టిమ్‌ సౌథీ వైడ్‌తో ఖాతా తెరిచాడు. తొలి ఓవర్‌ ముగిసేసరికి పర్యాటక జట్టు 8 పరుగులు చేసింది. కివీస్‌ ఫాస్ట్‌ పేసర్లు ఫెర్గూసన్‌, సౌథీ విండీస్‌ ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఫెర్గూసన్‌ ఒకే ఓవర్‌లో ఫ్లెచర్‌, హెట్‌మెయిర్‌ను అవుట్‌ చేయగా.. సౌథీ బ్రాండన్‌ కింగ్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన పావెల్‌ సైతం పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. సౌథీ బౌలింగ్‌లో ఫెర్గూసన్‌కు క్యాచ్‌ ఇచ్చి వికెట్‌ సమర్పించుకున్నాడు.

ఆ తర్వాత నికోలస్‌ పూరన్‌ను ఫెర్గూసన్‌ అవుట్‌ చేయడంతో కేవలం 59 పరుగులకే విండీస్‌ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక అప్పటికే క్రీజులో ఉన్న పొలార్డ్‌, అలెన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించారు. కానీ మరోసారి బంతితో మ్యాజిక్‌ చేసిన ఫెర్గూసన్‌ అలెన్‌ను, ఆ వెంటనే పాల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. అలా పద్నాలుగు ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్‌ జట్టు 146 పరుగులు చేసింది. ఇక 37 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచిన పొలార్డ్‌  కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి.. జట్టు భారీ స్కోరు(180) సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top