సిరీస్‌ కాపాడుకునేందుకు...

New Zealand vs India 2nd ODI match on 27 nov 2022 - Sakshi

నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ రెండో వన్డే

ఉదయం గం. 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రత్యక్ష ప్రసారం

హామిల్టన్‌: న్యూజిలాండ్‌ గడ్డపై గత పర్యటనలో టి20 సిరీస్‌ గెలిచిన భారత్‌ వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఈసారి కూడా టి20 సిరీస్‌ గెలిచిన ఊపులో వన్డేల్లో అడుగు పెట్టిన టీమిండియా తొలి మ్యాచ్‌ను చేజార్చుకుంది. 306 పరుగులు చేసిన తర్వాత కూడా ఆక్లాండ్‌లో ఓటమి ఎదురైంది. ఇప్పుడు ఇదే తరహా భారీ స్కోర్లకు వేదికైన పిచ్‌ సెడాన్‌ పార్క్‌లో ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ కోలుకొని సిరీస్‌ను మూడో వన్డే వరకు తీసుకెళుతుందా, లేక కివీస్‌ ఖాతాలో సిరీస్‌ చేరుతుందా చూడాలి. న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ వరుసగా గత 5 వన్డేలు ఓడగా... సొంతగడ్డపై కివీస్‌ వరుసగా 13 వన్డేలు నెగ్గి జోరు మీదుంది. మ్యాచ్‌కు వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశం ఉంది.  

కుల్దీప్‌కు చాన్స్‌!
తొలి వన్డేలో శిఖర్‌ ధావన్, గిల్, అయ్యర్‌ అర్ధ సెంచరీలు చేయగా, సంజు సామ్సన్‌ కూడా దూకుడుగా ఆడాడు. అయితే ఓపెనర్లు ధావన్, గిల్‌ మరీ నెమ్మదిగా ఆడటం, పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకోకపోవడం భారత్‌ను నష్టపరిచింది. సూర్యకుమార్‌ వైఫల్యం జట్టును కొంత ఇబ్బంది పెడుతోంది. టి20ల్లో విధ్వంసానికి మారుపేరుగా నిలుస్తున్న అతను వన్డేల్లో మాత్రం రాణించడం లేదు. అవసరమైతే ఆరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయం కోసం సూర్య స్థానంలో దీపక్‌ హుడాను ఎంపిక చేసే అవకాశం ఉంది. భారీగా పరుగులిచ్చిన శార్దుల్‌ స్థానంలో దీపక్‌ చహర్‌కు చాన్స్‌ దక్కవచ్చు. మరోవైపు లెగ్‌స్పిన్నర్‌ చహల్‌ బౌలింగ్‌లో మునుపటి పస కనిపించడం లేదు. అతనికి బదులుగా కుల్దీప్‌ యాదవ్‌ను ఆడించే ఆలోచనలతో మేనేజ్‌మెంట్‌ ఉంది.   

నీషమ్‌కు చోటు!
విలియమ్సన్‌ నాయకత్వంలో కివీస్‌ మంచి ఫామ్‌లో ఉంది. తొలి వన్డేలో ఆ జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఓపెనింగ్‌ నుంచి మిడిలార్డర్‌కు మారినా లాథమ్‌ బ్యాటింగ్‌లో జోరు తగ్గలేదు. ఓపెనర్లు అలెన్, కాన్వే దూకుడుగా ఆడగల సమర్థులు. గాయంతో గత మ్యాచ్‌కు దూరమై ఇప్పుడు కోలుకున్న నీషమ్‌... ఫిలిప్స్‌ స్థానంలో జట్టులోకి వస్తాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top