టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన న్యూజిలాండ్‌.. క్రికెట్‌తో పాటు హాకీలోనూ..!

New Zealand Defeating Team India In Mega Tourneys Of Cricket And Hockey - Sakshi

భారత దేశంలోని చిన్న రాష్ట్రాల జనాభా కంటే తక్కువ జనాభా ఉండే న్యూజిలాండ్‌ దేశం క్రీడల్లో మన పాలిట కొరకరాని కొయ్యలా మారింది. పురుషుల వరల్డ్‌కప్‌ హాకీలో నిన్న (జనవరి 22) బ్లాక్‌ క్యాప్స్‌ చేతిలో ఊహించని ఎదురుదెబ్బ తిన్న తర్వాత ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

క్రికెట్‌ విషయానికొస్తే.. కివీస్‌ చేతిలో భారత్‌కు ఇలాంటి షాక్‌లు తగలడం షరా మామూలే అయినప్పటికీ.. హకీలో మాత్రం మనకంటే కింది స్థాయి జట్టైన కివీస్‌ చేతిలో ఇలాంటి ఊహించని పరాభవం ఎదురుకావడం ఇదే మొదటిసారి. 

సునాయాసంగా క్వార్టర్‌ ఫైనల్‌కు క్వాలిఫై కావాల్సిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఏమరపాటుగా వ్యవహరించడంతో తగిన మూల్యమే చెల్లించుకున్నారు. చిన్న జట్టే కదా అని తేలిగ్గా తీసుకోవడంతో కివీస్‌ 3-3 (5-4) తేడాతో (పెనాల్టీ షూటౌట్‌లో) భారత్‌ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.

నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాట ఆడినప్పటికీ.. నిర్ణీత సమయంలో చేసిన అనవసర తప్పిదాల కారణంగా, పెనాల్టీ షూటౌట్‌లో ఆఖరి ఛాన్స్‌ను షంషేర్‌ మిస్‌ చేయడం కారణంగా భారత్‌ వరల్డ్‌కప్‌ రేసు నుంచి నిష్క్రమించింది. 

వరల్డ్‌కప్‌ హాకీలో కివీస్‌ చేతిలో ఎదురైన ఈ ఊహించని పరాభవం.. భారత క్రీడాభిమానులకు 2019 వన్డే వరల్డ్‌కప్‌ (క్రికెట్‌)లో ఇదే జట్టు చేతిలో సెమీస్‌లో ఎదురైన పరాజయాన్ని గుర్తు చేసిం‍ది. నాటి మ్యాచ్‌లోనూ భారత్ విజయానికి చేరువగా వచ్చినా అదృష్టం కివీస్ వైపే నిలిచింది. ఆ మ్యాచ్‌లో ధోని రనౌట్‌ అయిన దృశ్యం భారత క్రికెట్‌ ప్రేమికుల కళ్లల్లో నేటికీ మెదలుతూనే ఉంది.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. భారత్‌కు 240 పరుగుల టార్గెట్‌ నిర్ధేశించగా, ఛేదనలో తడబడిన భారత్‌ విజయానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ధోని (50), జడేజా (77), హార్ధిక్‌ (32) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. 

కివీస్‌ చేతిలో ఇలాం‍టి అపజయాలు (క్రికెట్‌) ఏదో నిన్న మొన్న మొదలయ్యాయని అనుకుంటే పొరబడ్డట్టే. వరల్డ్‌కప్‌ టోర్నీల్లో ఈ పరాభవాల పరంపర ఎప్పుడో 70ల్లోనే మొదలైంది. 1975, 1979, 1992 వరల్డ్‌కప్‌ల్లో న్యూజిలాండ్.. భారత్‌కు ఇలాంటి షాకులే ఇచ్చింది. అలాగే 2021లో జరిగిన ఐసీసీ తొట్టతొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్‌ ఫైనల్‌లోనూ న్యూజిలాండ్‌.. భారత్‌ను భారీ దెబ్బేసింది. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top