
Photo Courtesy: BCCI
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మధ్యలో విదేశీ ఆటగాళ్లంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. మే 17 నుంచి ఐపీఎల్ తిరిగి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా మంది ఆటగాళ్లు తిరిగి భారత్‌కు వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు.
జాతీయ జట్ల అవసరాల దృష్ట్యా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌కు చెందిన ఆటగాళ్లు లీగ్ తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉండరని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపుతూ ఐపీఎల్ తదుపరి మ్యాచ్‌ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. దీంతో డీసీ యాజమాన్యం అతనికి ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఎంపిక చేసుకుంది.

ముస్తాఫిజుర్‌ను డీసీ రూ. 6 కోట్లకు సొంతం చేసుకుంది. ముస్తాఫిజుర్ ఈ సీజన్‌లో డీసీ అడబోయే తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న డీసీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 పరాజయాలు, ఫలితం తేలని ఓ మ్యాచ్‌లో లభించిన పాయింట్‌తో కలుపుకుని 13 పాయింట్లు (0.362) సాధించింది.
ఈ సీజన్‌లో డీసీ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 18న గుజరాత్‌తో (ఢిల్లీ), మే 21న ముంబై ఇండియన్స్‌తో (ముంబై), మే 24న పంజాబ్‌తో (జైపూర్) తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు ఖచ్చితంగా గెలిస్తేనే డీసీ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మే 8న ఢిల్లీ, పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. అంతకుముందు హైదరాబాద్‌లో ఢిల్లీ, సన్‌రైజర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఫలితాలు వచ్చినా ఢిల్లీకి వ్యతిరేకంగా ఉండేవి.
ఈ రెంటిలో సన్‌రైజర్స్ మ్యాచ్‌కు గానూ ఢిల్లీకి ఓ పాయింట్ లభించగా.. పంజాబ్‌తో మ్యాచ్‌ను తిరిగి మొదటి నుండి ప్రారంభించనున్నారు (మే 24). పంజాబ్‌తో మ్యాచ్ రద్దయ్యే సమయానికి ఢిల్లీ ధీన స్థితిలో ఉండింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్మ, ప్రభ్‌సిమ్రన్ చెలరేగిపోయారు. 10 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 122 పరుగులు చేసింది.
పీడ వదిలిందనుకుంటున్న ఢిల్లీ అభిమానులు
ఢిల్లీ ఓపెనర్ మెక్‌గుర్క్ ఐపీఎల్ తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉండనని ప్రకటించిన నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో 9 కోట్లు పెట్టి కొనుక్కున్న మెక్‌గుర్క్ దారుణంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో 105.77 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు డకౌట్లు ఉన్నాయి.
మెక్‌గుర్క్ స్థానంలో వచ్చిన ముస్తాఫిజుర్ బౌలింగ్ విభాగంలో ఉపయోగపడగలడని డీసీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ డబ్ల్యూటీసీ ఫైనల్ కారణంగా తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. ప్లే ఆఫ్స్ బెర్త్ సాధించాలంటే ఫామ్‌లోనే లేని మెక్‌గుర్క్ కంటే ముస్తాఫిజుర్ నయమవుతాడని డీసీ అభిమానులు అనుకుంటున్నారు.