
నేడు ఐపీఎల్ క్వాలిఫయర్–2
పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీ
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇప్పటికే ఫైనల్ చేరగా... రెండో ఫైనలిస్ట్‌ను తేల్చే సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం క్వాలిఫయర్–2లో ముంబై ఇండియన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. క్వాలిఫయర్–1లో బెంగళూరు చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న పంజాబ్... ఈ పోరులో సత్తా చాటి ఫైనల్లో మరోసారి బెంగళూరును ఎదుర్కోవాలని భావిస్తోంది.
మరో వైపు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి... ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుచేసిన ముంబై ఇదే జోరులో పంజాబ్‌పై గెలిచి ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. క్వాలిఫయర్–1లో టాపార్డర్ విఫలమవడంతో పంజాబ్ 101 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి మూటగట్టుకోగా... ఎలిమినేటర్‌లో గుజరాత్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకుంటూ ముంబై భారీ స్కోరు చేసింది.
ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్ విజయం సాధించింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ సమష్టి ప్రదర్శన ముందు... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన పంజాబ్ కింగ్స్ ఏమాత్రం నిలుస్తుందో చూడాలి!
టాపార్డర్ రాణిస్తేనే...
ఈ సీజన్‌లో ఆడిన 15 మ్యాచ్‌ల్లో ఏడింట రెండొందల పైచిలుకు స్కోర్లు చేసిన పంజాబ్ జట్టు... టాపార్డర్ ప్రదర్శనపై అతిగా ఆధారపడుతోంది. అన్‌క్యాప్‌డ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య నిలకడకు ఇన్‌గ్లిస్, శ్రేయస్ మెరుపులు తోడవడంతో పంజాబ్ వరస విజయాలు సాధించగలిగింది. అయితే సొంతగడ్డపై జరిగిన క్వాలిఫయర్–1లో మాత్రం ఈ నలుగురు మూకుమ్మడిగా విఫలమవడంతో... జట్టు మూల్యం చెల్లించుకోక తప్పలేదు.
ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్లను ‘ప్లే ఆఫ్స్’కు చేర్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి... రికీ పాంటింగ్ వ్యూహాలు తోడవడంతో ఈ సీజన్‌లో పంజాబ్ పట్టికలో అగ్ర స్థానం దక్కించుకోగలిగింది. దీంతోనే క్వాలిఫయర్–1లో ఓడినా... ఫైనల్ చేరేందుకు మరో అవకాశం దక్కింది. ఈ సీజన్‌లో ప్రభ్‌సిమ్రన్ 517 పరుగులతో పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు సాధించగా... శ్రేయస్ 516, ప్రియాన్ష్ 431 పరుగులు చేశారు. ఈ ముగ్గురితో పాటు ఇన్‌గ్లిస్, నేహల్, శశాంక్, స్టొయినిస్ సత్తాచాటాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.
గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగని స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఈ మ్యాచ్ ఆడటం ఖాయమే. బౌలింగ్‌లో అర్ష్ దీప్ సింగ్, అజ్మతుల్లా, జెమీసన్, హర్‌ప్రీత్ బ్రార్ కీలకం కానున్నారు. గత మ్యాచ్ తప్పిదాలను సరిదిద్దుకోకపోతే... 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ ఇక్కడితోనే ప్రయాణాన్ని ముగించాల్సి ఉంటుంది.
బుమ్రానే ప్రధాన తేడా!
ఐపీఎల్ నాకౌట్స్‌లో అపార అనుభవం ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి కలిసికట్టుగా కదంతొక్కి ఆరో టైటిల్ వేటకు చేరాలని చూస్తోంది. పలువురు ఆటగాళ్ల సేవలు కోల్పోయినా... వారి స్థానాలను భర్తిచేసే ఆటగాళ్లు ఉండటం ముంబైకి కలిసి రానుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత రికెల్టన్, విల్ జాక్స్ జట్టును వీడినా... గత మ్యాచ్‌లో తొలిసారి ముంబై జట్టుకు ప్రాతనిధ్యం వహించిన జానీ బెయిర్‌స్టో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.
హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ కూడా టచ్‌లోకి రావడం ముంబై బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచింది. రోహిత్, బెయిర్‌స్టో జట్టుకు శుభారంభం అందిస్తుంటే... సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఈ సీజన్‌లో 673 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఆలస్యంగా వేగం పుంజుకున్న రోహిత్ 410 పరుగులు చేయగా... హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ ఫినిషర్ల పాత్ర పోషిస్తున్నారు.

గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దీపక్ చహర్ అందుబాటులో ఉండటం కష్టమే కాగా... గత మ్యాచ్ చివర్లో కండరాలు పట్టేసిన గ్లీసన్ బరిలోకి దిగుతాడా లేదా చూడాలి. ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా బుమ్రా కానున్నాడు. ఆశలే లేని స్థితిలో సైతం తన అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం ఉన్న బుమ్రాను... పంజాబ్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం.
తుది జట్లు (అంచనా)
పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య, జోస్ ఇన్‌గ్లిస్, నేహల్, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, హర్‌ప్రీత్ బ్రార్, జెమీసన్, చాహల్, అర్ష్ దీప్.
ముంబై ఇండియన్స్: హార్దిక్ (కెప్టెన్), రోహిత్ శర్మ, బెయిర్‌స్టో, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్, సాంట్నర్, రాజ్ బావా, గ్లీసన్, బుమ్రా, బౌల్ట్, అశ్వని కుమార్.
పిచ్, వాతావరణం
ఈ సీజన్‌లో అహ్మదాబాద్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట మొదట బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో టాస్ కీలక పాత్ర పోషించవచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు.
ఐపీఎల్‌లో నేడు (క్వాలిఫయర్–2)
పంజాబ్ X ముంబై
వేదిక: అహ్మదాబాద్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో