Mark Boucher: ముంబై ఇండియన్స్‌ హెడ్‌కోచ్‌గా మార్క్‌ బౌచర్‌

Mumbai Indians Appoint Mark Boucher As-Their Head Coach IPL 2023 - Sakshi

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్‌ శుక్రవారం(సెప్టెంబర్‌​ 16) తమ కొత్త కోచ్‌ను ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదుసార్లు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అందరు ఊహించనట్లుగానే దక్షిణాఫ్రికా మాజీ వికెట్‌ కీపర్‌ మార్క్‌ బౌచర్‌నే ముంబై ఇండియన్స్‌ హెడ్‌కోచ్‌ పదవి వరించింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం తమ అధికారిక ట్విటర్‌లో ప్రకటించింది. 

"మా కొత్త హెడ్‌ కోచ్‌ను పరిచయం చేస్తున్నాం. పల్టన్స్‌.. మన వన్‌ ఫ్యామిలీలోకి లెజెండ్‌ను స్వాగతించండి" అంటూ ముంబై ఇండియన్స్‌ ట్వీట్‌ చేసింది. మార్క్‌ బౌచర్‌ ఎంపికపై రిలయెన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ స్పందిస్తూ.. '' ముంబై ఇండియన్స్‌లోకి మార్క్‌ బౌచర్‌ను స్వాగతించడానికి సంతోషిస్తున్నా. ఫీల్డ్‌లో ప్లేయర్‌గా, బయట కోచ్‌గా ఎంతో నైపుణ్యం సాధించి తన టీమ్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించిన మార్క్‌ బౌచర్‌ రాకతో ముంబై ఇండియన్స్‌ బలోపేతమైంది. టీమ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాడన్న నమ్మకముంది" అని చెప్పుకొచ్చాడు. 

హెడ్‌కోచ్‌ పదవి రావడంపై మార్క్‌ బౌచర్‌ స్పందింస్తూ.. "ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌గా నియమితమవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆ టీమ్‌ చరిత్ర, వాళ్ల ఘనతలు ప్రపంచంలోని బెస్ట్‌ స్పోర్టింగ్‌ ఫ్రాంఛైజీల్లో ఒకదానిగా ముంబై ఇండియన్స్‌ను నిలబెడతాయి. ఈ సవాలుకు నేను సిద్ధంగా ఉన్నా. గొప్ప నాయకత్వం, గొప్ప ప్లేయర్స్‌తో ముంబై బలంగా ఉంది. ఈ టీమ్‌కు నా సలహాలు అందించడానికి ఎదురుచూస్తున్నా" అని తెలిపాడు.

ఇక వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ నుంచి ముంబై ఇండియన్స్‌కు బౌచర్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటి వరకూ హెడ్‌ కోచ్‌గా ఉన్న మహేల జయవర్దనె సెంట్రల్‌ టీమ్‌కు ప్రమోట్‌ కావడంతో ఆ స్థానం ఖాళీ అయింది. జయవర్దనేతో పాటు జహీర్‌ఖాన్‌ను కూడా ఆ టీమ్‌ సెంట్రల్‌ టీమ్‌కు ప్రమోట్‌ చేసిన విషయం తెలిసిందే. 

ఇటీవలే ముంబై ఇండియన్స్‌ సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్‌లోనూ టీమ్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూడు టీమ్స్‌ను కలుపుతూ ఒక సెంట్రల్‌ టీమ్‌ ఏర్పాటు చేశారు. వాటి బాధ్యతలనే జయవర్దనే, జహీర్‌ఖాన్‌లకు అప్పగించారు. కాగా బౌచర్‌ ఈ మధ్యే సౌతాఫ్రికా కోచ్‌ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఓటమితో బౌచర్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే అతడు టీ20 వరల్డ్‌కప్‌ వరకూ ఆ టీమ్‌తో కొనసాగనున్నాడు.

కాగా దక్షిణాఫ్రికా తరపున దాదాపు 15 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన మార్క్‌ బౌచర్‌ అత్యుత్తమ వికెట్‌ కీపర్‌గా ఎదిగాడు. ప్రొటిస్‌ తరపున బౌచర్‌ 147 టెస్టులు, 295 వన్డేలు ఆడాడు. బౌచర్‌ కెరీర్‌లో ఐదు టెస్టు సెంచరీలు సహా ఒక వన్డే సెంచరీ ఉంది. ఇక వికెట్‌ కీపర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 999 స్టంపింగ్స్‌, 952  క్యాచ్‌లు తీసుకొని కొత్త చరిత్ర సృష్టించాడు. 2012లో సోమర్‌సెట్‌తో మ్యాచ్‌ ఆడుతుండగా.. పొరపాటున ఎడమ కంటిలోకి బెయిల్‌ దూసుకెళ్లింది. దీంతో కంటిచూపు దెబ్బతినడంతో బౌచర్‌ అర్థంతరంగా తన క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. 

చదవండి: ప్రైవేట్‌ లీగ్స్‌ మోజులో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ వదులుకున్నాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top