‘మేం దూరదృష్టితో ఆలోచిస్తాం’

Mumbai Indians always have short-term goal and long-term vision - Sakshi

ముంబై ఇండియన్స్‌ యజమాని నీతా అంబానీ వ్యాఖ్య

ముంబై: ఐపీఎల్‌లో తాము ఆటగాళ్లను కొనుగోలు చేసే సమయంలో రాబోయే సీజన్లను కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు ముంబై ఇండియన్స్‌ యజమాని నీతా అంబానీ వ్యాఖ్యానించారు. తమ కొత్త జట్టు ముంబై అభిమానులకు కూడా నచ్చుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. జోఫ్రా ఆర్చర్‌ 2022లో ఆడలేడని తెలిసినా ముంబై భారీ మొత్తానికి అతడిని సొంతం చేసుకుంది. ‘ముంబై ఇండియన్స్‌ టీమ్‌ను నిర్మించడంలో మేం స్వల్ప కాలిక లక్ష్యాలను పెట్టుకుంటూనే దూరదృష్టితో కూడా ఆలోచిస్తాం.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే వేలంలో కొందరు ఆటగాళ్లను తీసుకున్నాం. అభిమానుల నమ్మకం వమ్ము కాకుండా మా జట్టు లీగ్‌లో ఆడుతుందని ఆశిస్తున్నాం. నిజానికి మెగా వేలం అంటే చాలా కష్టమైన వ్యవహారం. ఇన్నేళ్లుగా మాతో ఉన్న ఆటగాళ్లను వదిలేయడానికి మనసొప్పదు. కానీ తప్పదు. హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, డి కాక్, బౌల్ట్‌లను మా జట్టులోకి తీసుకునేందుకు చివరి వరకు ప్రయత్నించాం. అయితే ఇప్పుడు ఉన్న టీమ్‌ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం’ అని నీతా స్పష్టం చేసింది.  

మాకూ సంతోషమే...
వేలంలో తాము తీసుకున్న ఆటగాళ్ల పట్ల రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ), రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. డు ప్లెసిస్‌ రాకతో తమ టాపార్డర్‌ మెరుగైందని, కెప్టెన్‌గా అతనికి ఉన్న విశేష అనుభవం తమ జట్టుకు అదనపు ప్రయోజనాన్ని కల్పిస్తుందని ఆర్‌సీబీ హెడ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. మరోవైపు బలమైన భారత ఆటగాళ్లతో జట్టును రూపొందించాలనే ఉద్దేశంతో వేలం బరిలోకి దిగామని, ఈ విషయంలో విజయవంతమయ్యామని రాజస్తాన్‌ రాయల్స్‌ యజమాని మనోజ్‌ బదాలే చెప్పాడు. సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్‌లతో పాటు అశ్విన్, చహల్, కరుణ్‌ నాయర్, సైనీ, దేవ్‌దత్‌ పడిక్కల్, ప్రసిధ్‌ కృష్ణవంటి ఆటగాళ్లు రాయల్స్‌ను గెలిపించగలరని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top