Rohit Sharma: రోహిత్‌పై సిరాజ్‌ ప్రశంసలు.. ఇలాంటి కెప్టెన్‌ ఉంటే!

Mohammed Siraj Praises Rohit Sharma Feels Great To Work Under Him - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ప్రశంసలు కురిపించాడు. జట్టులోని ఆటగాళ్ల మానసిక స్థితిని అర్థం చేసుకుని, వారిని ప్రోత్సహిస్తాడని తెలిపాడు. రోహిత్‌ సారథ్యంలో ఆడటం గొప్ప అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం తాను ఫిట్‌నెస్‌పై దృష్టి సారించానన్న సిరాజ్‌.. నిలకడగా ఆడుతూ ముందుకు సాగడమే తన లక్ష్యమని తెలిపాడు.

కాగా ఐపీఎల్‌-2022లో పూర్తిగా నిరాశపరిచిన సిరాజ్‌.. టీమిండియా-ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరిదైన ఐదో టెస్టు కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూస్‌ 18 క్రిక్‌నెక్ట్స్‌తో మాట్లాడాడు ఈ హైదరాబాదీ క్రికెటర్‌. టీ20 ఫార్మాట్‌ నుంచి వెంటనే టెస్టు క్రికెట్‌ ఫార్మాట్‌కు మారడం సవాలు వంటిదేనని, అయితే.. ఇందుకోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు.

ఈ సందర్భంగా రోహిత్‌ శర్మ కెప్టెన్సీ గురించి చెబుతూ.. ‘‘ప్రతి ఒక్క ఆటగాడి మానసిక స్థితిని రోహిత్‌ అర్థం చేసుకుంటాడు. మైదానం లోపల కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు ప్లాన్‌ బీతో ముందుకు వస్తాడు. ఆటగాళ్లలో స్థైర్యం నింపుతాడు. ధైర్యంగా పోరాడేలా ప్రోత్సహిస్తాడు.

ఇలా ప్రతి ఒక్క ఆటగాడిని అర్థం చేసుకునే కెప్టెన్‌ సారథ్యంలో ఆడటం నిజంగా మంచి అనుభూతి’’ అని సిరాజ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరాజ్‌కు ఆ జట్టు మాజీ సారథి, టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో ప్రత్యేక అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.

ఇంగ్లండ్‌తో టెస్టు(జూలై 1 నుంచి 5) భారత టెస్టు జట్టు: 
రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్, గిల్, కోహ్లి, శ్రేయస్, విహారి, పుజారా, పంత్, షమీ, జడేజా, సిరాజ్, శార్దుల్, శ్రీకర్‌ భరత్, అశ్విన్, బుమ్రా, ఉమేశ్, ప్రసిధ్‌ కృష్ణ.

చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్‌.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్‌లో ఆడతా: ప్రొటిస్‌ కెప్టెన్‌
IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్‌ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top