
ఓవల్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. వరుసగా రెండో రోజును బౌలర్లు శాసించారు. తొలి సెషన్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు అధిపత్యం చెలాయించినప్పటికి.. లంచ్ విరామం తర్వాత భారత బౌలర్లు అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు.
ముఖ్యంగా హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ బంతితో మ్యాజిక్ చేశాడు. మొదటి సెషన్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న సిరాజ్.. రెండో సెషన్‌లో మాత్రం ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. సంచలన బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు.
మొత్తంగా 16.2 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్, 86 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్‌తో పాటు ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.
భారత్ ప్రస్తుతం 52 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఆఖరి టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
బుమ్రా రికార్డు బద్దలు..
ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక ఫోర్ వికెట్ల హాల్స్ సాధించిన భారత బౌలర్‌గా బుమ్రాను సిరాజ్ అధిగమించాడు. సిరాజ్ మియా ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో 11 టెస్టులు ఆడి ఆరు సార్లు 4 వికెట్ల హాల్ సాధించాడు.
2021లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ సిరాజ్ నాలుగు వికెట్ల ఘనత సాధించాడు. ఆ తర్వాత 2022లో ఎడ్జ్‌బాస్టన్, 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో 4 వికెట్లను సిరాజ్ పడగొట్టాడు.
అదేవిధంగా ప్రస్తుత సిరీస్‌లో బర్మింగ్‌హామ్‌లో నాలుగుకు పైగా వికెట్లు తీసిన సిరాజ్.. మళ్లీ ఇప్పుడు ఓవల్ టెస్టులో 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ రేర్ ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. కాగా బుమ్రా ఇప్పటివరకు ఇంగ్లండ్ గడ్డపై 5 సార్లు 4 వికెట్ల హాల్ సాధించాడు.
అంతేకాకుండా ఈ ఫీట్ సాధించిన ఏషియన్ బౌలర్‌గానూ వకార్ యూనిస్ రికార్డును సిరాజ్ సమం చేశాడు. పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ ఇంగ్లండ్ గడ్డపై 6 సార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించాడు.
చదవండి: గ్రాహం థోర్ప్‌కు నివాళిగా...