
మొనాకో గ్రాండ్‌ప్రి రేసులో టైటిల్ సాధించిన మెక్‌లారెన్ డ్రైవర్ లాండో నోరిస్
చిన్ననాటి కల నిజమైందన్న బ్రిటన్ రేసర్
ఆఖరి ల్యాప్‌లో దక్కిన విజయం
మోంటెకార్లో: టెన్నిస్‌లో ‘వింబుల్డన్’... బ్యాడ్మింటన్‌లో ‘ఆల్ ఇంగ్లండ్’... ఫార్ములావన్‌లో ‘మొనాకో’ గ్రాండ్‌ప్రి... ఆయా క్రీడాంశాల్లోని క్రీడాకారులు పై మూడింటిలో గెలిస్తే ఎంతో గొప్పగా, ఎంతో గౌరవంగాభావిస్తారు. బ్రిటన్ రేసింగ్ డ్రైవర్ లాండో నోరిస్ ఆదివారం మొనాకో వీధుల్లో తన చిన్ననాటి కలను నిజం చేసుకున్నాడు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మొనాకో గ్రాండ్‌ప్రిలో నోరిస్ విజేతగా అవతరించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన లాండో నోరిస్ నిర్ణీత 78 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే వేగంగా 1 గంట 40 నిమిషాల 33.843 సెకన్లలో ముగించి టైటిల్ సాధించాడు. ‘ఎంతో గొప్పగా అనిపిస్తోంది.
ఏనాటికైనా మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలవాలని చిన్ననాటి నుంచి కలలు కన్నాను. ఇప్పుడు నా స్వప్నం సాకారమైంది’ అని ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందుకున్న నోరిస్ వ్యాఖ్యానించాడు. మొనాకో గ్రాండ్‌ప్రి మొత్తం వీధుల్లోనే జరుగుతుంది కాబట్టి నిర్వాహకులు ఈ రేసులో ప్రత్యేక నిబంధనను ప్రవేశపెట్టారు. ఈసారి డ్రైవర్లందరూ కచ్చితంగా రెండుసార్లు పిట్ స్టాప్‌లోకి వెళ్లి టైర్లు మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును ఆరంభించిన నోరిస్ 20వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు.
ఆ తర్వాత 20వ ల్యాప్‌లో నోరిస్ పిట్ స్టాప్‌లోకి వెళ్లడంతో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్‌స్టాపెన్ ఆధిక్యంలోకి వచ్చాడు. వెర్‌స్టాపెన్ 29వ ల్యాప్‌లో తొలిసారి పిట్ స్టాప్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత వెర్‌స్టాపెన్ 77వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నా రెండోసారి పిట్ స్టాప్‌లోకి వెళ్లలేదు. 77వ ల్యాప్‌లో వెర్‌స్టాపెన్ పిట్ స్టాప్‌లోకి ప్రవేశించగా... ఇదే అదనుగా నోరిస్ దూసుకుపోయి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి చివరి ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఫెరారీ డ్రైవర్ లెక్‌లెర్క్ రెండో స్థానంలో, ఆస్కార్ పియాస్ట్రి (మెక్‌లారెన్) మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వెర్‌స్టాపెన్ నాలుగో స్థానంతోసరిపెట్టుకున్నాడు. మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌కు ఐదో స్థానం దక్కింది. ఇద్దరు డ్రైవర్లు ఫెర్నాండో అలోన్సో (ఆస్టన్ మార్టిన్), పియరీ గ్యాస్లీ (అల్పైన్) రేసును పూర్తి చేయలేకపోయారు.
ప్రస్తుత సీజన్‌లో ఎనిమిది రేసులు ముగిశాయి. ఆరింటిలో మెక్‌లారెన్ డ్రైవర్లు, రెండింటిలో రెడ్‌బుల్ డ్రైవర్లు విజేతలుగా నిలిచారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో 161 పాయింట్లతో ఆస్కార్ పియాస్ట్రి తొలి స్థానంలో, 158 పాయింట్లతో లాండో నోరిస్ రెండో స్థానంలో, 136 పాయింట్లతో వెర్‌స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు స్పానిష్ గ్రాండ్‌ప్రి జూన్ 1న జరుగుతుంది.
