breaking news
MONACO GRAND PRIX
-
స్వప్నం సాకారం
మోంటెకార్లో: టెన్నిస్‌లో ‘వింబుల్డన్’... బ్యాడ్మింటన్‌లో ‘ఆల్ ఇంగ్లండ్’... ఫార్ములావన్‌లో ‘మొనాకో’ గ్రాండ్‌ప్రి... ఆయా క్రీడాంశాల్లోని క్రీడాకారులు పై మూడింటిలో గెలిస్తే ఎంతో గొప్పగా, ఎంతో గౌరవంగాభావిస్తారు. బ్రిటన్ రేసింగ్ డ్రైవర్ లాండో నోరిస్ ఆదివారం మొనాకో వీధుల్లో తన చిన్ననాటి కలను నిజం చేసుకున్నాడు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మొనాకో గ్రాండ్‌ప్రిలో నోరిస్ విజేతగా అవతరించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన లాండో నోరిస్ నిర్ణీత 78 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే వేగంగా 1 గంట 40 నిమిషాల 33.843 సెకన్లలో ముగించి టైటిల్ సాధించాడు. ‘ఎంతో గొప్పగా అనిపిస్తోంది. ఏనాటికైనా మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలవాలని చిన్ననాటి నుంచి కలలు కన్నాను. ఇప్పుడు నా స్వప్నం సాకారమైంది’ అని ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకున్న నోరిస్ వ్యాఖ్యానించాడు. మొనాకో గ్రాండ్‌ప్రి మొత్తం వీధుల్లోనే జరుగుతుంది కాబట్టి నిర్వాహకులు ఈ రేసులో ప్రత్యేక నిబంధనను ప్రవేశపెట్టారు. ఈసారి డ్రైవర్లందరూ కచ్చితంగా రెండుసార్లు పిట్ స్టాప్‌లోకి వెళ్లి టైర్లు మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును ఆరంభించిన నోరిస్ 20వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. ఆ తర్వాత 20వ ల్యాప్‌లో నోరిస్ పిట్ స్టాప్‌లోకి వెళ్లడంతో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ ఆధిక్యంలోకి వచ్చాడు. వెర్స్టాపెన్ 29వ ల్యాప్‌లో తొలిసారి పిట్ స్టాప్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత వెర్స్టాపెన్ 77వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నా రెండోసారి పిట్ స్టాప్‌లోకి వెళ్లలేదు. 77వ ల్యాప్‌లో వెర్స్టాపెన్ పిట్ స్టాప్‌లోకి ప్రవేశించగా... ఇదే అదనుగా నోరిస్ దూసుకుపోయి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి చివరి ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ రెండో స్థానంలో, ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్) మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ నాలుగో స్థానంతోసరిపెట్టుకున్నాడు. మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌కు ఐదో స్థానం దక్కింది. ఇద్దరు డ్రైవర్లు ఫెర్నాండో అలోన్సో (ఆస్టన్ మార్టిన్), పియరీ గ్యాస్లీ (అల్పైన్) రేసును పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుత సీజన్లో ఎనిమిది రేసులు ముగిశాయి. ఆరింటిలో మెక్లారెన్ డ్రైవర్లు, రెండింటిలో రెడ్‌బుల్ డ్రైవర్లు విజేతలుగా నిలిచారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో 161 పాయింట్లతో ఆస్కార్ పియాస్ట్రి తొలి స్థానంలో, 158 పాయింట్లతో లాండో నోరిస్ రెండో స్థానంలో, 136 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు స్పానిష్ గ్రాండ్‌ప్రి జూన్ 1న జరుగుతుంది. -
నోరిస్‌కు పోల్ పొజిషన్
మొనాకో: ఫార్ములా వన్ సీజన్ తొమ్మిదో రేసు మొనాకో గ్రాండ్ ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ పోల్ పొజిషన్ సాధించాడు. ఈ క్రమంలో నోరిస్ ట్రాక్ రికార్డును తిరగరాశాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో నోరిస్ 1 నిమిషం 9.954 సెకన్లలో ల్యాప్‌ను పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. 2019లో లూయిస్ హామిల్టన్ టైమింగ్‌ను తాజాగా నోరిస్ అధిగమించాడు. ఈ సీజన్ ఆరంభ ఆ్రస్టేలియా గ్రాండ్ ప్రి తర్వాత నోరిస్‌కు ఇదే తొలి పోల్ పొజిషన్. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు.గతేడాది ఈ రేసులో విజేతగా నిలిచిన స్థానిక డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 నిమిషం 10.063 సెకన్లు; ఫెరారీ) రెండో స్థానం దక్కించుకోగా... మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి (1 నిమిషం 10.063 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయిన ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 10.382 సెకన్లు) నాలుగో స్థానంలో నిలవగా... డిఫెండింగ్ చాంపియన్, రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 నిమిషం 10.669 సెకన్లు) ఐదో ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ల జోరు సాగుతుండగా... ఎనిమిది రేసులు ముగిసేసరికి డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పియాస్ట్రి 146 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లాండోనోరిస్ 133 పాయింట్లతో రెండో ప్లేస్‌లో కొనసాగుతుండగా... నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ (124 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. -
‘మొనాకో’ విజేత పెరెజ్
మోంటెకార్లో: పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మొనాకో గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెర్జియో పెరెజ్ విజేతగా నిలిచాడు. ఆదివారం మోంటెకార్లో నగర వీధుల్లో జరిగిన ఈ రేసులో పెరెజ్ 64 ల్యాప్‌ల రేసును అందరికంటే వేగంగా గంటా 56 నిమిషాల 30.265 సెకన్లలో ముగించి ఈ సీజన్లో తొలి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. వర్షం కారణంగా 77 ల్యాప్‌ల రేసును 64 ల్యాప్‌లకు కుదించారు. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) రెండో స్థానంలో, వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ముగ్గురు డ్రైవర్లు అల్బోన్ (విలియమ్స్ రేసింగ్), మిక్ షుమాకర్ (హాస్), మాగ్నుసన్ (హాస్) రేసును పూర్తి చేయలేకపోయారు. తదుపరి రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి జూన్ 12న జరుగుతుంది. చదవండి: Chamundeswaranath: నిఖత్ జరీన్‌కు బహుమతిగా కారు -
Monaco Grand Prix: విజేత వెర్స్టాపెన్
మోంటెకార్లో: తన కారులో తలెత్తిన సాంకేతిక లోపంతో ‘పోల్ పొజిషన్’ సాధించిన చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) రేసు ఆరంభానికి ముందే తప్పుకోవడంతో... తొలి స్థానం నుంచి రేసును ఆరంభించిన మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మొనాకో గ్రాండ్‌ప్రిలో అదరగొట్టాడు. ఆదివారం జరిగిన 78 ల్యాప్‌ల ప్రధాన రేసులో ఎక్కడా తడబడకుండా డ్రైవ్ చేసిన వెర్స్టాపెన్... అందరికంటే ముందుగా గంటా 38 నిమిషాల 56.820 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఇక సీజన్లో వెర్‌స్టాపెన్‌కు ఇది రెండో విజయం. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలువగా... హామిల్టన్ (మెర్సిడెస్) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్లో తదుపరి గ్రాండ్‌ప్రి అజర్బైజాన్ వేదికగా జూన్ 6న జరగనుంది. చదవండి: Asian Boxing Championship: భారత్‌కు 7 పతకాలు ఖాయం This way to the 🔝 of the standings ➡️🏆 #MonacoGP 🇲🇨pic.twitter.com/CEiSv1bK4o — Red Bull Racing Honda (@redbullracing) May 23, 2021 No floating energy station this year but still plenty of 𝒕𝒉𝒊𝒔 ENERGY!!! 🙌 #MonacoGP 🇲🇨 #GivesYouWings pic.twitter.com/Rh8a5WGmKP — Red Bull Racing Honda (@redbullracing) May 23, 2021 -
మొనాకో గ్రాండ్‌ప్రి రద్దు
పారిస్: ఫార్ములావన్ (ఎఫ్1) క్యాలెండర్లో 65 ఏళ్లుగా నిర్విరామంగా జరుగుతోన్న విఖ్యాత వీధి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి రద్దయింది. ప్రస్తుతం కరోనా (కోవిడ్–19) యూరప్‌లో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మే 24న ఈ రేసు జరగాల్సి ఉంది. దాంతో ఈ ఏడాది ఎఫ్1 సీజన్లో రద్దయిన రెండో రేసుగా మొనాకో నిలిచింది. 1929లో ఎఫ్1 క్యాలెండర్లో అరంగేట్రం చేసిన ఈ రేసు చివరిసారిగా 1954లో జరగలేదు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి (జీపి)తో గత వారమే ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్ ఘనంగా ఆరంభమవ్వాల్సి ఉండగా ... కరోనా కారణంతో తొలి రేసును రద్దు చేశారు. అనంతరం ఈ ఆదివారం జరగాల్సిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి, ఏప్రిల్‌లో జరగాల్సిన వియత్నాం, చైనీస్ రేసులను కూడా వాయిదా వేస్తూ అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ) నిర్ణయం తీసుకుంది. దాంతో 2020 సీజన్ మే 1న డచ్ గ్రాండ్‌ప్రితో ఆరంభమవుతుందని భావించారు. అయితే డచ్ గ్రాండ్‌ప్రి రేసును, మే 8న జరగాల్సిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి రేసును కూడా వాయిదా వేస్తున్నట్లు రేసు నిర్వాహకులు తెలిపారు. దీంతో ప్రస్తుత సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎఫ్1 నిర్వాహకులు మాత్రం జూన్ 7న జరగాల్సిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రితో సీజన్ ఆరంభమవుతుందనే విశ్వాసంతో ఉన్నారు. -
రన్నరప్ హంపి
మోంటెకార్లో: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 7 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 5.5 పాయింట్లతో ఆరో స్థానాన్ని సంపాదించింది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 7 పాయింట్లతో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా), అలెగ్జాండ్రా గొర్యాచికినా (రష్యా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే టోర్నీ టైబ్రేక్ నిబంధనల ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... కొస్టెనిక్ విజేతగా నిలిచింది. హంపి రన్నరప్‌గా నిలువగా... గొర్యాచికినా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌లో గొర్యాచికినాపై హంపి 68 ఎత్తుల్లో గెలిచింది. అంతకుముందు వాలెంటినా గునీనా (రష్యా), మరియా ముజిచుక్ (ఉక్రెయిన్), జావో జుయ్ (చైనా)లపై కూడా నెగ్గిన హంపి... హారిక (భారత్), నానా జాగ్‌నిద్జె (జార్జియా), అనా ముజిచుక్ (ఉక్రెయిన్), కాటరీనా లాగ్నో (రష్యా), కొస్టెనిక్ (రష్యా), పియా క్రామ్లింగ్ (స్వీడన్)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ఎలిజబెత్ పాట్జ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. ఓవరాల్‌గా హంపి నాలుగు గేముల్లో గెలిచి, ఆరింటిని ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడింది. హారిక 11 గేములు ఆడి మూడింటిలో (ఎలిజబెత్, గునీనా, మరియాలపై) విజయం సాధించింది. నానా జాగ్‌నిద్జె, పియా క్రామ్లింగ్, అనా ముజిచుక్, హంపి, లాగ్నోలతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హారిక... గొర్యాచికినా, కొస్టెనిక్, జావో జుయ్లతో జరిగిన మూడు గేముల్లో ఓడిపోయింది. నాలుగు గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నమెంట్లలో భాగంగా రెండు టోర్నీలు ముగిశాక హంపి మొత్తం 293 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. గత సెప్టెంబర్‌లో రష్యాలో జరిగిన తొలి గ్రాండ్‌ప్రి టోర్నీలో హంపి విజేతగా నిలిచింది. గ్రాండ్‌ప్రి సిరీస్‌లో మొత్తం 15 మంది క్రీడాకారిణులు గరిష్టంగా మూడు టోర్నీల్లో ఆడతారు. ఇప్పటికే రెండు టోర్నీలు ఆడిన హంపి వచ్చే ఏడాది మే నెలలో ఇటలీలో జరిగే చివరిదైన నాలుగో గ్రాండ్‌ప్రి టోర్నీలో పాల్గొంటుంది. హారిక మాత్రం వచ్చే ఏడాది మార్చిలో స్విట్జర్లాండ్‌లో జరిగే మూడో గ్రాండ్‌ప్రి టోర్నీలో ఆడుతుంది. ప్రస్తుతం హారిక 120 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో ఉంది. టాప్–2లో నిలిచిన వారు క్యాండిడేట్ చెస్ టోర్నీకి అర్హత సాధిస్తారు. క్యాండిడేట్ టోర్నీ విజేత ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ప్రస్తుత మహిళల ప్రపంచ చాంపియన్‌తో 12 గేమ్‌లు ఆడుతుంది. -
హామిల్టన్ హవా
మొనాకో: క్వాలిఫయింగ్‌లో దుమ్మురేపిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ప్రధాన రేసులోనూ అదరగొట్టాడు. ఫలితంగా ఆదివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 78 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ గంటా 43 నిమిషాల 28.437 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానంలో, వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది నాలుగో టైటిల్ కాగా... మెర్సిడెస్ జట్టుకు ఆరో విజయం కావడం విశేషం. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఆరు రేసుల్లోనూ మెర్సిడెస్ డ్రైవర్లే విజేతగా నిలిచారు. మెర్సిడెస్‌కే చెందిన మరో డ్రైవర్ బొటాస్ రెండు రేసుల్లో గెలిచాడు. మొనాకో విజయాన్ని ఫార్ములావన్ దిగ్గజం నికీ లాడా (ఆస్ట్రియా)కు హామిల్టన్ అంకితం ఇచ్చాడు. మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నికీ లాడా గత సోమవారం మృతి చెందారు. ఈ సీజన్లో ఆరు రేసులు ముగిశాక హామిల్టన్ 137 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 9న జరుగుతుంది. -
వెటెల్ విజయం
► సీజన్లో మూడో టైటిల్ ► మొనాకో గ్రాండ్‌ప్రిలో ఫెరారీ హవా మోంటెకార్లో (మొనాకో): మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, నికో రోస్‌బర్గ్ జోరులో గత రెండు సీజన్లలో వెనుకబడిపోయిన మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ ఈ ఏడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెటెల్ ఈ సీజన్లో తన ఖాతాలో మూడో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. 78 ల్యాప్లపాటు జరిగిన ఈ రేసును వెటెల్ గంటా 44 నిమిషాల 44.340 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫెరారీ జట్టుకే చెందిన కిమీ రైకోనెన్ రెండో స్థానంలో, రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఒకాన్ వరుసగా 12వ, 13వ స్థానాల్లో నిలిచి నిరాశ పరిచారు. తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 11న జరుగుతుంది. మొత్తం 20 మంది డ్రైవర్లు బరిలోకి దిగగా... 13 మంది మాత్రమే రేసును పూర్తి చేశారు. మిగతా ఏడుగురు మధ్యలోనే వైదొలిగారు. 16 ఏళ్ల తర్వాత... ‘పోల్ పొజిషన్’తో ప్రధాన రేసును ఆరంభించిన రైకోనెన్ 35 ల్యాప్‌ల వరకు ఆధిక్యంలో ఉండగా... ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న వెటెల్ ఆధిక్యంలోకి దూసుకొచ్చాడు. ఆ ఆధిక్యాన్ని చివరి ల్యాప్ వరకు కాపాడుకొని వెటెల్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. దాంతో 2001లో షుమాకర్ తర్వాత వెటెల్ రూపంలో మొనాకో గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్‌కు మళ్లీ టైటిల్ లభించింది. కెరీర్లో 45 రేసుల్లో గెలిచిన వెటెల్ మొనాకో గ్రాండ్‌ప్రిలో రెండోసారి టైటిల్ సాధించాడు. చివరిసారి వెటెల్ 2011లో రెడ్‌బుల్ జట్టు తరఫున ఇక్కడ గెలిచాడు. సీజన్లో ఆరు రేసులు ముగిశాక... తాజా గెలుపుతో వెటెల్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో 129 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. 104 పాయింట్లతో హామిల్డన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, 75 పాయింట్లతో బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానంలో ఉన్నారు. -
హామిల్టన్ బోణీ
మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం ‘ఫోర్స్’ పెరెజ్‌కు మూడో స్థానం మోంటెకార్లో: ఫార్ములావన్‌లో ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో తొలి విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి రేసులో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. 78 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 59 నిమిషాల 29.133 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 44వ విజయం కాగా... మొనాకో గ్రాండ్‌ప్రిలో రెండో టైటిల్. చివరిసారి 2008లో హామిల్టన్ ఈ రేసులో విజేతగా నిలిచాడు. ‘ పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన రికియార్డో (రెడ్‌బుల్) రెండో స్థానాన్ని పొందగా... భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 28 రేసుల తర్వాత ఫోర్స్ ఇండియా డ్రైవర్ టాప్-3లో నిలిచాడు. ఫోర్స్ ఇండియాకే చెందిన మరో డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానాన్ని పొందడం విశేషం. ఈ రేసులో ఏడుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 12న జరుగుతుంది. -
హామిల్టన్ బోణీ
మోంటెకార్లో: గత ఐదు గ్రాండి ప్రిల్‌లో విఫలమైన మెర్సిజట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈసారి అద్వితీయమైన ప్రదర్శనతో పుంజుకున్నాడు. మొనాకో గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచి ఈ సీజన్లో తొలి టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ప్రధాన రేసును మూడో స్థానం ప్రారంభించిన హామిల్టన్ దుమ్మురేపాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో హామిల్టన్ అందరికంటే ముందుగా లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచాడు. కాగా, ఈ సీజన్లో నాలుగు టైటిల్స్ సాధించిన మెర్సిజట్టుకే చెందిన సహచర డ్రైవర్ నికోలస్ రోస్ బర్గ్ ఏడో స్థానానికి పరిమితమయ్యాడు., అయితే రేసును మొదటి స్థానం నుంచి ఆరంభించిన డానియల్ రికియార్డో (రెడ్ బుల్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
రోస్బర్గ్కు ‘పోల్’
తొలి రెండు గ్రిడ్లు మెర్సిడెస్వే నేడు మొనాకో గ్రాండ్‌ప్రి మోంటెకార్లో: ఈ సీజన్ ఆరంభం నుంచి ఆధిపత్యం చలాయిస్తున్న మెర్సిడెస్ జట్టు మొనాకో గ్రాండ్‌ప్రిలోనూ విజయంపై దృష్టి సారించింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. గత ఏడాది ఈ రేసులో విజేతగా నిలిచిన రోస్‌బర్గ్ క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా ఒక నిమిషం 15.989 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. అయితే ల్యాప్ చివర్లో ఈ జర్మన్ డ్రైవర్ చేసిన పొరపాటు అతని సహచరుడు లూయిస్ హామిల్టన్ ‘పోల్’ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ల్యాప్ ముగిసే సమయంలో రోస్‌బర్గ్ అదుపుతప్పి ట్రాక్ దాటి వేరే మార్గంలో వెళ్లిపోయి తిరిగి వెనక్కి వచ్చాడు. దాంతో నిర్వాహకులు ప్రమాద సూచికగా పసుపు జెండాను ప్రదర్శించారు. దాంతో నిబంధనల ప్రకారం... రోస్‌బర్గ్ వెనకాలే వేగంగా దూసుకొస్తున్న హామిల్టన్ తన కారును నెమ్మదించాల్సి వచ్చింది. దాంతో అతను క్వాలిఫయింగ్ చివరి ల్యాప్‌లో తన సమయాన్ని మెరుగుపర్చుకోలేకపోయాడు. చివరకు రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రోస్‌బర్గ్ వ్యవహరించిన తీరుపై స్టీవార్డ్స్ విచారణ చేపట్టారు. దాంతో ‘పోల్ పొజిషన్’ ఫలితం తారుమారు అవుతుందా అనే అనుమానం కలిగింది. అయితే విచారణ అనంతరం స్టీవార్డ్స్ రోస్బర్గ్పై చర్య తీసుకోకపోడంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ జర్మన్ డ్రైవరే తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ 10వ స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 11వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. రోస్‌బర్గ్ ఉద్దేశపూర్వకంగానే ట్రాక్ నుంచి పక్కదారి పట్టాడా లేదా అనే విషయంపై వ్యాఖ్యానించేందుకు అతని సహచర డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిరాకరించాడు. చివరి ల్యాప్‌లో తాను దూకుడు మీద ఉన్నానని... రోస్‌బర్గ్ పొరపాటు చేయకపోయుంటే తనకూ ‘పోల్ పొజిషన్’ అవకాశం దక్కేదని గత నాలుగు రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్ అన్నాడు.