
మొనాకో గ్రాండ్ ప్రి
మొనాకో: ఫార్ములా వన్ సీజన్ తొమ్మిదో రేసు మొనాకో గ్రాండ్ ప్రిలో మెక్‌లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ పోల్ పొజిషన్ సాధించాడు. ఈ క్రమంలో నోరిస్ ట్రాక్ రికార్డును తిరగరాశాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో నోరిస్ 1 నిమిషం 9.954 సెకన్లలో ల్యాప్‌ను పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. 2019లో లూయిస్ హామిల్టన్ టైమింగ్‌ను తాజాగా నోరిస్ అధిగమించాడు. ఈ సీజన్ ఆరంభ ఆ్రస్టేలియా గ్రాండ్ ప్రి తర్వాత నోరిస్‌కు ఇదే తొలి పోల్ పొజిషన్. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు.
గతేడాది ఈ రేసులో విజేతగా నిలిచిన స్థానిక డ్రైవర్ చార్‌లెస్ లెక్‌లెర్క్ (1 నిమిషం 10.063 సెకన్లు; ఫెరారీ) రెండో స్థానం దక్కించుకోగా... మెక్‌లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి (1 నిమిషం 10.063 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయిన ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 10.382 సెకన్లు) నాలుగో స్థానంలో నిలవగా... డిఫెండింగ్ చాంపియన్, రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ (1 నిమిషం 10.669 సెకన్లు) ఐదో ప్లేస్ దక్కించుకున్నాడు.
ఈ సీజన్‌లో మెక్‌లారెన్ డ్రైవర్ల జోరు సాగుతుండగా... ఎనిమిది రేసులు ముగిసేసరికి డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పియాస్ట్రి 146 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లాండోనోరిస్ 133 పాయింట్లతో రెండో ప్లేస్‌లో కొనసాగుతుండగా... నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్ వెర్‌స్టాపెన్ (124 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు.