‘అదే మ్యాచ్‌లో టర్నింగ్‌  పాయింట్‌’

Maxwells Wicket Was Turning Point Deep Dasgupta - Sakshi

కాన్‌బెర్రా:  ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియాకు ఓటమి తప్పదేమో అనుకున్న తరుణంలో తిరిగి పుంజుకుని విజయాన్ని సాధించింది.  టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆసీస్‌ 31 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి ఒత్తిడిలో పడగా,  మ్యాక్స్‌వెల్‌ ఆట తీరుతో మళ్లీ గాడిలోకి వచ్చింది. మ్యాక్స్‌వెల్‌ 38 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌లతో 59 పరుగులు చేసి ఔటైన తర్వాత కానీ టీమిండియా రేసులోకి రాలేదు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా బుమ్రా వేసిన 45 ఓవర్‌ మూడో బంతికి మ్యాక్స్‌వెల్‌ బౌల్డ్‌ అయ్యాడు.  ఆసీస్‌ 268 పరుగుల వద్ద ఉండగా మ్యాక్స్‌వెల్‌ ఏడో వికెట్‌గా ఔట్‌ కావడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. (హ్యాట్సాఫ్‌ జడేజా : మంజ్రేకర్‌)

టీమిండియా విజయం సాధించడానికి మ్యాక్సీ ఔటే  టర్నింగ్‌ పాయింట్‌. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ వికెట్‌  కీపర్‌ దీప్‌దాస్‌ గుప్తా స్పష్టం చేశాడు. స్పోర్ట్స్‌ టుడే యూట్యూబ్‌ చానల్‌లో మాట్లాడిన దీప్‌దాస్‌ గుప్తా.. ‘ మ్యాక్స్‌వెల్‌ వికెట్‌ మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌. టీమిండియా విజయం సాధించడానికి, ఆసీస్‌ ఓటమి చెందడానికి ఈ వికెటే ప్రధాన కారణం.  మ్యాక్స్‌వెల్‌ మ్యాచ్‌ను ముగించే ఊపులో కనిపించాడు. ఔట్‌ కాకుండా ఉంటే మ్యాచ్‌ టీమిండియా చేజారిపోయేది. బుమ్రా తనమిటో మళ్లీ నిరూపించుకున్నాడు. కచ్చితమైన డెలివరీతో మ్యాక్సీని ఔట్‌  చేశాడు. అది మ్యాచ్‌లో కీలక మలుపు’ అని తెలిపాడు. 

ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. పాండ్యా(92 నాటౌట్‌), జడేజా(66 నాటౌట్‌),  కోహ్లి(63) లు రాణించి జట్టు స్కోరు మూడొందలు దాటడంలో సహకరించాడు. ఆపై ఆసీస్‌ 49.3 ఓవర్లలో 289 పరుగులకే ఆలౌటై పరాజయం చెందింది.  శార్దూల్‌ ఠాకూర్‌ మూడు వికెట్లతో రాణించగా,  బుమ్రా, నటరాజన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్‌, జడేజాలకు తలో వికెట్‌ దక్కింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top