బ్యాటింగ్‌లో మార్ష్‌ బౌలింగ్‌లో ప్రిన్స్‌ | Lucknow Super Giants to beat Royal Challengers Bengaluru by 9 runs | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్‌లో మార్ష్‌ బౌలింగ్‌లో ప్రిన్స్‌

May 8 2026 5:58 AM | Updated on May 8 2026 8:24 AM

Lucknow Super Giants to beat Royal Challengers Bengaluru by 9 runs

లక్నో సూపర్‌ జెయింట్స్‌ కీలక విజయం

9 పరుగులతో ఓడిన బెంగళూరు 

సెంచరీతో చెలరేగిన మిచెల్‌ మార్ష్  

మ్యాచ్‌లో ఓడితే ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు కోల్పోయే స్థితిలో మైదానంలోకి దిగిన లక్నో తీవ్ర ఒత్తిడి మధ్య సత్తా చాటింది. చక్కటి ఆటతో బెంగళూరును చిత్తు చేసింది. మార్ష్ మెరుపు సెంచరీతో భారీ స్కోరు నమోదు చేసిన జట్టు...ప్రిన్స్‌ పదునైన బౌలింగ్‌తో ఆర్‌సీబీని కట్టడి చేయగలిగింది. పాటీదార్, డేవిడ్‌ దూకుడు డిఫెండింగ్‌ చాంపియన్‌ను గెలిపించడానికి సరిపోలేదు. వరుసగా ఆరు ఓటముల తర్వాత లక్నోకు ఈ గెలుపు దక్కడం విశేషం.  

లక్నో: ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కాస్త ఊరట లభించింది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ సమష్టి ప్రదర్శన కనబర్చింది. గురువారం జరిగిన పోరులో లక్నో 9 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై విజయం సాధించింది. వర్షం కారణంగా ఆటకు పదే పదే అంతరాయం కలగడంతో ఇన్నింగ్స్‌ను 19 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 

మిచెల్‌ మార్ష్ (56 బంతుల్లో 111; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) ఐపీఎల్‌లో తన రెండో సెంచరీని నమోదు చేయగా...నికోలస్‌ పూరన్‌ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (10 బంతుల్లో 32 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు.  అనంతరం బెంగళూరు లక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్ణయించారు. బెంగళూరు 19 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసి ఓడిపోయింది. రజత్‌ పాటీదార్‌ (31 బంతుల్లో 61; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), టిమ్‌ డేవిడ్‌ (17 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతావారు ప్రభావం చూపలేదు.  

పంత్‌ జోరు... 
లక్నో ఓపెనర్‌ మార్ష్ దూకుడుగా ఇన్నింగ్స్‌ మొదలు పెట్టగా, సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన అర్షిన్‌ కులకర్ణి (17) తడబడ్డాడు. ఏకపక్షంగా మార్ష్ బౌండరీల జోరు సాగింది. హాజల్‌వుడ్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన మార్ష్...కృనాల్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టాడు. ఆ తర్వాత సలామ్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో పాటు హాజల్‌వుడ్‌ ఓవర్లో కూడా మార్ష్ 3 ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 68 పరుగులకు చేరగా, 20 బంతుల్లోనే మార్ష్ అర్ధసెంచరీ పూర్తయింది. 

అర్షిన్‌ వెనుదిరిగిన తర్వాత పూరన్‌ తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. మరో వైపు షెఫర్డ్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ బాదిన మార్ష్ 49 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. అతను సెంచరీ అందుకునే సమయానికి జట్టు స్కోరు 139 పరుగులు అంటే మార్ష్ జోరు ఎలా సాగిందో అర్థమవుతుంది. మార్ష్, పూరన్‌ తక్కువ వ్యవధిలో అవుటైనా...పంత్‌ మెరుపులతో స్కోరు 200 దాటింది. హాజల్‌వుడ్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అతను...సలామ్‌ వేసిన చివరి ఓవర్లో వరుసగా 4, 4, 6తో ముగించాడు. 

కోహ్లి డకౌట్‌... 
ఛేదనలో ఆర్‌సీబీకి సరైన ఆరంభం లభించలేదు. బెతెల్‌ (4) వైఫల్యం కొనసాగగా...ప్రిన్స్‌ వేసిన అద్భుత బంతికి విరాట్‌ కోహ్లి (0) డకౌటయ్యాడు. 2023 సీజన్‌ తర్వాత కోహ్లి డకౌట్‌ కావడం ఇదే తొలిసారి. ఈ దశలో పాటీదార్‌ సిక్సర్లతో చెలరేగిపోగా, పడిక్కల్‌ (25 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 53 బంతుల్లోనే 95 పరుగులు జోడించడంతో బెంగళూరుకు విజయావకాశాలు కనిపించాయి. అయితే ఎనిమిది పరుగుల తేడాతో వీరిద్దరితో పాటు జితేశ్‌ (1) కూడా అవుట్‌ కావడంతో జట్టు కష్టాలు పెరిగాయి. ఇలాంటి స్థితిలో డేవిడ్‌ దూకుడైన ఆటతో టీమ్‌లో ఆశలు రేగాయి. 22 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి ఉండగా డేవిడ్‌ను షహబాజ్‌ అవుట్‌ చేయడంతో ఆర్‌సీబీకి గెలుపు కష్టంగా మారిపోయింది.  

స్కోరు వివరాలు  
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్ష్ (సి) బెతెల్‌ (బి) హాజల్‌వుడ్‌ 111; అర్షిన్‌ (సి) పాటీదార్‌ (బి) కృనాల్‌ 17; పూరన్‌ (సి) కృనాల్‌ (బి) సలామ్‌ 38; పంత్‌ (నాటౌట్‌) 32; మార్క్‌రమ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 209.  
వికెట్ల పతనం: 1–95, 2–165, 3–194. 
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–34–0, హాజల్‌వుడ్‌ 4–0–49–1, కృనాల్‌ 4–0–31–1, సలామ్‌ 4–0–53–1, సుయాశ్‌ 2–0–21–0, షెఫర్డ్‌ 1–0–16–0. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: బెతెల్‌ (సి) ప్రిన్స్‌ (బి) షమీ 4; కోహ్లి (బి) ప్రిన్స్‌ 0; పడిక్కల్‌ (సి) అండ్‌ (బి) ప్రిన్స్‌ 34; పాటీదార్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) షహబాజ్‌ 61; జితేశ్‌ (సి) పంత్‌ (బి) ప్రిన్స్‌ 1; డేవిడ్‌ (సి) రాఠీ (బి) షహబాజ్‌ 40; కృనాల్‌ పాండ్యా (నాటౌట్‌) 28; షెఫర్డ్‌ (నాటౌట్‌) 23; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 203. 
వికెట్ల పతనం: 1–9, 2–9, 3–104, 4–106, 5–112, 6–167. 
బౌలింగ్‌: షమీ 4–0–33–1, ప్రిన్స్‌ 4–0–33–3, మయాంక్‌ 4–0– 50–0, రాఠీ 4–0–50–0, షహబాజ్‌ 3–0–33–2.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement