సిల్హెట్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (మే 16) మొదలైన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ జట్టు తడబడి నిలబడింది. లిట్టన్ దాస్ వీరోచితమైన పోరాటం చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్ (278 పరుగులు) చేయగలిగింది. పాక్ బౌలర్ల ధాటికి బంగ్లా టాపార్డర్ కుప్పకూలగా.. దాస్ ఒంటరిపోరాటం చేసి సూపర్ శతకంతో మెరిశాడు. ఓ పక్క సహచరులు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా, దాస్ బాధ్యతాయుతంగా ఆడి జట్టు పతనాన్ని అడ్డుకున్నాడు.
దాస్ 159 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 126 పరుగులు చేసి 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. దాస్ మినహా బంగ్లా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. తంజిద్ హసన్ (26), మొమినుల్ హక్ (22), కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (23), తైజుల్ ఇస్లాం (16), ఫోరిఫుల్ ఇస్లాం (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
మిగతా ఆటగాళ్లలో మెహిద్ హసన్ మిరాజ్ 4, తస్కిన్ అహ్మద్ 7 పరుగులు చేయగా.. మహ్మదుల్ హసన్ జాయ్, నహిద్ రాణా డకౌట్లయ్యారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 4, మొహమ్మద్ అబ్బాస్ 2, హసన్ అలీ 2, సాజిద్ ఖాన్ ఓ వికెట్ తీశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. అజాన్ అవైస్ 13, అబ్దుల్లా ఫజల్ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 257 పరుగులు వెనుకపడి ఉంది.
కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ పాక్‌పై 104 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది.


