మెస్సీ మరో చరిత్ర | Lionel Messi Creates World Record As Argentina Edge Cape Verde In FIFA World Cup Thriller, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

మెస్సీ మరో చరిత్ర

Jul 4 2026 11:31 AM | Updated on Jul 4 2026 11:51 AM

Lionel Messi Scripts FIFA World Cup History, Becomes First Player To Score in Eight Consecutive Matches

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ మరో చరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్‌ 2026లో భాగంగా కేప్ వెర్డేతో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో గోల్‌ చేయడం ద్వారా.. వరుసగా 8 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో గోల్‌ చేసిన తొలి ఫుట్‌బాలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 

ఓవరాల్‌గా మెస్సీకి ఇది 20వ ఫిఫా వరల్డ్‌ కప్‌ గోల్‌. ఈ గోల్‌తో అతడు ఫిఫా ప్రపంచకప్‌ లీడింగ్‌ గోల్‌ స్కోరర్‌గా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ గోల్‌తో మెస్సీ గోల్డెన్‌ బూట్‌ అవకాశాలను కూడా మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ గోల్‌ ప్రస్తుత ప్రపంచకప్‌ ఎడిషన్‌లో మెస్సీకి 7వది. గోల్డెన్‌ బూట్‌ రేసులో ఫ్రాన్స్‌ ఆటగాడు కైలియన్‌ ఎంబపే 6 గోల్స్‌తో మెస్సీ వెనువెంటనే ఉన్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. అర్జెంటీనా 3-2 గోల్స్‌ తేడాతో కేప్ వెర్డేపై గెలుపొంది, రౌండ్‌ ఆఫ్‌ 16లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో కేప్‌ వెర్డే ఓడినా, వీరోచితంగా పోరాడి అందరి మనసులు గెలుచుకుంది. చివరి వరకు ఆ జట్టు ఓటమి ఒప్పుకోకుండా పోరాడిన తీరు ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలి గోల్‌ మెస్సీదే. 29వ నిమిషంలో అతడు ఈ గోల్‌ సాధించాడు.

59వ నిమిషంలో కేప్‌ వెర్డే ఆటగాడు డెరోయ్ డువార్టే గోల్‌తో స్కోర్‌ను 1-1 చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ పోరుగా మారి ఉత్కంఠను పెంచింది.

అర్జెంటీనా తరఫున మెస్సీ, మార్టినెజ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కేప్‌ వెర్డే గోల్‌కీపర్ వోజిన్హా అద్భుత సేవ్‌లతో అడ్డుకున్నాడు. నిర్ణీత 90 నిమిషాల్లో విజేత తేలకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అక్కడే అసలైన డ్రామా మొదలైంది.

అదనపు సమయం ప్రారంభమైన వెంటనే 93వ నిమిషంలో లిసాండ్రో మార్టినెజ్ గోల్‌తో అర్జెంటీనా మళ్లీ ముందంజలోకి వెళ్లింది. అయితే ఆ ఆనందం వారికి ఎంతోసేపు నిలవలేదు. 103వ నిమిషంలో లారోస్ కాబ్రాల్ (కేప్‌ వెర్డే) అద్భుతమైన గోల్‌తో స్కోర్‌ను సమం చేశాడు.

ఈ ఉత్కంఠ అక్కడితో ఆగలేదు. 111వ నిమిషంలో క్రిస్టియన్ రొమెరో హెడర్ కేప్‌ వెర్డే ఆటగాడు డినే (ఓన్‌ గోల్‌) ద్వారా అర్జెంటీనాను మళ్లీ ఆధిక్యంలో తీసుకెళ్లింది. ఆతర్వాత కేప్‌ వెర్డే వరుస ఎటాక్స్‌ చేసినా.. ఎమిలియానో మార్టినెజ్ అద్భుత సేవ్‌లతో అడ్డుకున్నాడు. చివరికి 3-2 తేడాతో అర్జెంటీనా విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లోకి అడుగుపెట్టింది.

ఈ మ్యాచ్‌లో గెలుపు డిఫెండింగ్ ఛాంపియన్‌దే అయినా అల్ప జనాభా ఉన్న కేప్‌ వెర్డే చూపిన పోరాటం ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకుంది. ఆఫ్రికా పడమటి తీరానికి దూరంగా సముద్రంలో ఉన్న చిన్న దీవుల దేశం కేప్‌ వెర్డే. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఈ జట్టు చూపిన పోరాటం ఫుట్‌బాల్‌ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement