భారత్‌ పోరాటం ముగిసె...

Lakshya Sen, Saina Nehwal crash out in India Open 2023 - Sakshi

లక్ష్యసేన్, సైనా ఓటమి

ఇండియా ఓపెన్‌

న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో వెటరన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ గాయంతో వైదొలగగా... కృష్ణ ప్రసాద్‌–విష్ణువర్ధన్‌ గౌడ్‌ జోడీ ఓడిపోయింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట కూడా నిరాశపరిచింది.

గురువారం జరిగిన పోటీల్లో ప్రపంచ 12వ ర్యాంకర్, ఏడో సీడ్‌ లక్ష్యసేన్‌ 21–16, 15–21, 18–21తో ప్రపంచ 20వ ర్యాంకర్‌ రస్మస్‌ గెమ్కే (డెన్మార్క్‌) చేతిలో కంగుతిన్నాడు. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సైనా 9–21, 12–21తో ఒలింపిక్‌ చాంపియన్‌ చెన్‌ యు ఫె (చైనా) ధాటికి నిలువలేకపోయింది. మహిళల డబుల్స్‌ ప్రి క్వార్టర్‌ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జంట 9–21, 16–21తో ఆరో సీడ్‌ జాంగ్‌ షు జియాన్‌–జెంగ్‌ యు (చైనా) ద్వయం చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో గరగ కృష్ణప్రసాద్‌–విష్ణువర్ధన్‌ గౌడ్‌ జోడీ 14–21, 10–21తో లియాంగ్‌ వి కెంగ్‌– వాంగ్‌ చాంగ్‌ (చైనా) ద్వయం చేతిలో ఇంటిదారి పట్టింది. సాత్విక్‌ సాయిరాజ్‌ తుంటిగాయం వల్ల చిరాగ్‌ షెట్టితో కలిసి బరిలోకి దిగలేకపోయాడు. దీంతో చైనాకే చెందిన లియు చెన్‌–జువాన్‌ యి జంట వాకోవర్‌తో ముందంజ వేసింది.

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top