RCB: అక్కడే మొదలు.. అ​‍క్కడే ముగిస్తా: కేఎల్‌ రాహుల్ | KL Rahul recalled Virat Kohli's reaction after the India batter signed for RCB. - Sakshi
Sakshi News home page

KL Rahul: అ​‍క్కడే ముగిస్తా: ఆ జట్టుపై కేఎల్‌ రాహుల్ ప్రేమ

Published Fri, Apr 19 2024 4:49 PM

Kohli Said Its Not Option Just Sign This: KL Rahul Intriguing RCB Contract Tale - Sakshi

‘‘ఆ రోజు విరాట్‌ అక్కడే ఉన్నాడు. కోచ్‌ రే జెన్సింగ్స్‌.. ఇంకా మిగతా సహాయక సిబ్బంది కూడా ఉన్నారు. అప్పుడు విరాట్‌ వచ్చి.. ‘నీకు ఈ కాంట్రాక్ట్‌ మీద సంతకం పెట్టడం ఇష్టమేనా? ఆర్సీబీకి ఆడతావా? అని అడిగాడు.

అందుకు బదులుగా.. ‘ఏంటీ జోక్‌ చేస్తున్నావా?.. నా చిరకాల కల అది’ అని అన్నాన్నేను. అప్పుడు విరాట్‌.. ‘అవును.. జోక్‌ చేశానులే.. అయినా.. ఇది నీకు ఆప్షన్‌ కాదు.. ముందు ఈ కాంట్రాక్టు మీద సంతకం పెట్టు’ అన్నాడు. 

నేను అలాగే చేశాను. అప్పుడు వెంటనే విరాట్‌ స్పందిస్తూ.. ‘ఇక నుంచి  నీ ప్రయాణం క్రేజీగా ఉండబోతోంది. వచ్చే రెండు నెలలు నీకు ఫుల్‌ మజా’ అంటూ నన్ను ఆటపట్టించాడు’’ అని టీమిండియా స్టార్‌, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు.

క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. కాగా కర్ణాటకకు చెందిన కన్ననూర్‌ లోకేశ్‌ రాహుల్‌ 2013లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున అరంగేట్రం చేశాడు. ఆ ఏడాది దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అదరగొట్టి ఐపీఎల్‌లోనూ ఎంట్రీ ఇచ్చాడు. 

కేకేఆర్‌తో మ్యాచ్‌తో ఎంట్రీ
సొంతమైదానం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆర్సీబీ తరఫున అరంగేట్రం చేశాడు. ఇక ఆ తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌(కెప్టెన్‌)కు ఆడిన రాహుల్‌.. 2022లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. తమ తొలి సీజన్‌లోనే లక్నోను ప్లే ఆఫ్స్‌ చేర్చి సత్తా చాటాడు.

ఇక ఐపీఎల్‌-2024లోనూ ప్రస్తుతం లక్నో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌లలో మూడు గెలిచి ఐదో స్థానంలో ఉంది. శుక్రవారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో లక్నో వేదికగా సూపర్‌ జెయింట్స్‌ తలపడనుంది.

ఇదిలా ఉంటే.. లక్నోకు సారథిగా ఉన్నా కేఎల్‌ రాహుల్‌ మనసులో ఆర్సీబీకి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. తన సొంత రాష్ట్రానికి చెందిన ఫ్రాంఛైజీ కావడంతో పాటు.. తనకు లైఫ్‌ కూడా ఇచ్చిన ఆర్సీబీ అంటే అతడికి గౌరవం. ఈ విషయాన్ని తాజాగా రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు రాహుల్‌.

అక్కడే మొదలు.. అక్కడే ముగిస్తా
‘‘ఆ రెండు నెలలు ఆర్సీబీలో నేను చాలా నేర్చుకున్నాను. మంచి అనుభవం గడించాను. అంతా త్వరత్వరగా జరిగిపోయింది. బెంగళూరుకు ఆడటం నాకెల్లప్పుడూ ఇష్టమే. నా కెరీర్‌ మొదలైందే అక్కడ! 

అక్కడే కెరీర్‌ ముగిస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నా. ఏదేమైనా భిన్న జట్లతో.. భిన్న ప్లేయర్లతో కలిపే ఐపీఎల్‌ ఓ అద్భుతమైన టోర్నీ’’ అని కేఎల్‌ రాహుల్‌ చెప్పుకొచ్చాడు. 

చదవండి: హార్దిక్‌ను పట్టించుకోని ఆకాశ్‌.. రోహిత్‌ మాట విని అలా! వైరల్‌ వీడియో

Advertisement
 
Advertisement