హార్దిక్‌ను పట్టించుకోని ఆకాశ్‌.. రోహిత్‌ మాట విని అలా ఆఖరికి! | IPL 2024, MI Vs PBKS: Akash Madhwal Ignores MI Skipper Hardik Pandya And Listens To Rohit Sharma For Field Placement In Last Over; Video Viral - Sakshi
Sakshi News home page

హార్దిక్‌ను పట్టించుకోని ఆకాశ్‌.. రోహిత్‌ మాట విని అలా! వైరల్‌ వీడియో

Published Fri, Apr 19 2024 2:44 PM

Hardik Watches On As Rohit Plots Final Over Strategy Vs PBKS Viral - Sakshi

ఐపీఎల్‌-2024లో పంజాబ్‌ కింగ్స్‌- ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ ఆఖరి వరకు ఉత్కంఠ రేపింది. చివరి ఓవర్‌ వరకు ఇరు జట్ల మధ్య ఊగిసలాడిన విజయం ఆఖరికి ముంబై వైపు మొగ్గు చూపింది. ఫలితంగా హార్దిక్‌ సేన ఈ సీజన్‌లో ఎట్టకేలకు మూడో విజయం అందుకుంది.

అయితే, గురువారం నాటి ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. కాగా చంఢీగడ్‌లోని ముల్లన్‌పూర్‌ వేదికగా సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 

సూర్యకుమార్‌ యాదవ్‌ అర్ధ శతకం(78) సాధించగా.. రోహిత్‌ శర్మ (36), తిలక్‌ వర్మ(18 బతుల్లో 34-నాటౌట్‌) రాణించడంతో ముంబై మెరుగైన స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది.

ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే చతికిలపడ్డ పంజాబ్‌ కింగ్స్‌ 14/4 స్కోరుతో తేలికగా మ్యాచ్‌ను ముంబైకి అర్పించేసుకుంటుంది అనిపించింది. కానీ పంజాబ్‌ హీరోలు శశాంక్‌ సింగ్‌(25 బంతుల్లో 41), అశుతోశ్‌ శర్మ(61) అంత తేలికగా తలవంచలేదు.

ముంబైకి చెమటలు పట్టిస్తూ ఓ దశలో మ్యాచ్‌ను పంజాబ్‌ వైపు తిప్పేశారు. టెయిలెండర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌(21) పట్టుదలగా పోరాడాడు. అయితే, హర్షల్‌ పటేల్‌(1 నాటౌట్‌)తో పాటు కగిసో రబడ క్రీజులో ఉన్న తరుణంలో ఆఖరి ఓవర్‌లో పంజాబ్‌ విజయ సమీకరణం 12 పరుగులుగా మారింది.

ఈ క్రమంలో ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ చేతికి బంతినిచ్చాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో.. తీవ్ర ఒత్తిడి నడుమ ఆకాశ్‌ మధ్వాల్‌ ఫీల్డ్‌ సెట్‌ చేసే సమయంలో మాజీ సారథి రోహిత్‌ శర్మ వద్దకు వెళ్లి సలహాలు తీసుకున్నాడు.

హార్దిక్‌ పాండ్యా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా పట్టించుకోని ఆకాశ్‌ మధ్వాల్‌.. రోహిత్‌తో చాలా సేపు చర్చించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కాగా.. ‘మాస్టర్‌ మైండ్‌’ రోహిత్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆకాశ్‌ మధ్వాల్‌ను ఆది నుంచి ఎంకరేజ్‌ చేసింది రోహిత్‌ శర్మనే అంటూ గుర్తుచేస్తున్నారు.

ఇక మధ్వాల్‌ బౌలింగ్‌లో  ఫీల్డ్‌ సెట్‌ చేసే విషయంలో అలాగే జస్‌ప్రీత్‌ బుమ్రా సైతం తన వంతు సాయం అందించాడు. ఇక పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌ వేసిన మధ్వాల్‌ బౌలింగ్‌లో తొలి బంతి వైడ్‌గా వెళ్లగా.. రెండో బంతికి రబడ రనౌట్‌ కావడం(మహ్మద్‌ నబీ/ఇషాన్‌ కిషన్‌)తో పంజాబ్‌ కథ ముగిసిపోయింది. ముంబై తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది.

Advertisement
 
Advertisement