Kobe Bryant Death: కన్నీళ్లు తెప్పించిన సజీవదహనం ఫోటోలు.. '31 మిలియన్‌ డాలర్లు చెల్లించండి'

Kobe Bryant Wife Vanessa Wins USD16 Million Lawsuit Crash Photos Trial - Sakshi

అమెరికన్‌ బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్‌ బ్రియాంట్‌ 2020లో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అతని మరణవార్త అప్పట్లో క్రీడాలోకాన్ని తీవ్ర దిగ్ర్బాంతికి గురి చేసింది. సబర్బన్ లాస్ ఏంజిల్స్‌లో పొగమంచు కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగాయి. దీంతో బ్రియంట్‌తో సహా ఆయన 13 ఏళ్ల కూతురు జియానా దుర్మరణం చెందింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో హెలికాప్టర్‌లో ఉన్న మరో ఎనిమిది మంది కూడా సజీవదహనమయ్యారు.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.


PC: కోబ్‌ బ్రియాంట్‌ భార్య వెనెస్సా బ్రియాంట్‌

అప్పట్లో కోబ్‌ బ్రియాంట్‌ మృతిపై సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా లాస్‌ ఏంజిల్స్‌ కౌంటీ డిప్యూటీస్‌ సహా అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫోటోలు తీశారు. అంతటితో ఊరుకోకుండా ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో బ్రియాన్‌ సజీవదహనం ఫోటోలు వైరల్‌ అయ్యాయి. ఈ ఫోటోలు బ్రయంట్ భార్య వెనెస్సాను ఎమోషన్‌కు గురిచేయడంతో పాటు మానసిక సంఘర్షణకు గురయ్యేలా చేశాయి.

తన అనుమతి లేకుండా ఫోటోలు సోషల్‌ మీడియాలో పెట్టడంపై లాస్‌ ఏంజిల్స్‌ కౌంటీపై కోర్టులో దావా వేసింది. తాజాగా బుధవారం దావాను పరిశీలించిన తొమ్మిది మందితో కూడిన ధర్మాసనం.. తీర్పును వెనెస్సాకు అనుకూలంగా ఇచ్చింది.  కోబ్ బ్రయంట్ భార్య సహా మిగతావాళ్లకు కలిపి లాస్ ఏంజెల్స్ కౌంటీ 31 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. వెనెస్సా బ్రయంట్ కుటుంబంతో పాటు క్రిస్ చెస్టర్, అతని భార్య సారా, కుమార్తె పేటన్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. దీంతో 31 మిలియన్‌ డాలర్స్‌లో వెనెస్సా బ్రియంట్‌కు 16 మిలియన్‌ డాలర్లు.. చెస్టర్‌ ఫ్యామిలీకి 15 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని కౌంటీకి పేర్కొంది.


PC: కోబ్‌ బ్రియాంట్‌ కుటుంబం(ఫైల్‌ ఫోటో)

ధర్మాసనం తీర్పును చదవగానే భావోద్వేగానికి గురైన వెనెస్సా బ్రియాంట్‌ విలేకరులతో మాట్లాడకుండానే కన్నీళ్లు పెట్టుకుంటూ కోర్టు ఆవరణ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన భర్త బ్రియాంట్‌, కూతురు జియానా ఫోటోను షేర్‌ చేస్తూ "ఆల్ ఫర్ యు! ఐ లవ్ యు! జస్టిస్ ఫర్ కోబ్ అండ్ జిగి!" అని క్యాప్షన్‌ జత చేసింది.


PC: కోబ్‌ బ్రియాంట్‌(ఫైల్‌ ఫోటో)

కొబ్ బ్రయంట్ తన 20 ఏళ్ల కెరీర్‌లో పలు రికార్డులు సాధించారు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచారు. 18సార్లు ఆల్ టైమ్ స్టార్ గా నిలిచారు. 2016లో ఎన్ బీఎ నుంచి మూడోసారి ఆల్ టైమ్ స్కోరర్ గా రిటైర్ అయ్యారు. కొబ్ బ్రయంట్ 2012 ఒలింపిక్స్ లో యూఎస్ టీమ్ తరపున ఆడి రెండు స్వర్ణ పతకాలు అందుకున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top