
వాషింగ్టన్: ఫేస్‌బుక్‌లో తనని బ్యాన్‌చేయడంపై జుకర్ బర్గ్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు ఇప్పటిది కాదు.. గత ఎనిమిదేళ్లుగా కోర్టులో నలుగుతూనే ఉంది. ఇంతకీ.. ఫేస్‌బుక్ తనని బ్యాన్ చేయడంపై జుకర్ బర్గ్ కేసు ఎందుకు పెట్టారని అనుకుంటున్నారా?
అమెరికాలో 38వ అతిపెద్ద రాష్ట్రం ఇండియానా. ఇప్పుడీ రాష్ట్రానికి చెందిన మార్క్ స్టీవెన్ జుకర్‌బర్గ్ అనే న్యాయవాది.. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌పై న్యాయపోరాటం చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా మెటా(గతంలో ఫేస్‌బుక్) తన అకౌంట్‌ను బ్యాన్ చేసిందని, ఫలితంగా భారీ మొత్తంలో నష్టపోయినట్లు కోర్టులో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ న్యాయవాది పేరు మార్క్ జుకర్ బర్గ్. కానీ అతను మెటావర్స్ నిర్మించడంలో కాదు. దివాళా కేసుల్లో వాదిస్తుంటారు. 2017 నుండి తన న్యాయ సేవలను ప్రచారం చేసేందుకు ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించారు. ఇందుకోసం 11వేల డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశాడు. కానీ అతని పేజీని తరచూ ఫేస్‌బుక్ బ్లాక్ చేస్తూనే ఉంది. ఎందుకు అని ప్రశ్నిస్తే.. మీరు ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్‌ను అనుకరిస్తున్నారనే సమాధానం చెబుతోంది. తనను తానే నిరూపించుకోవడం అతనికి రోజువారీ తలనొప్పిగా మారింది.
ఇదే విషయంపై స్థానిక టీవీ ఛానల్‌కు మాట్లాడుతూ, "బిలియనీర్ జుకర్‌బర్గ్ స్కూల్ పూర్తిచేసేలోపే నేను న్యాయవాదిగా పని చేస్తున్నాను’ అని చెప్పారు. ఇది మీకు వ్యంగ్యంగా అనిపించవచ్చు. కానీ ఆర్ధికంగా నష్టపోయేది నేనే కదా.
డబ్బుపోయా, శనిపట్టుకుంది అన్న చందంగా ఫేస్‌బుక్ నా అకౌంట్‌ను బ్యాన్ చేయడంతో బిజినెస్‌ను కోల్పోయాను. iammarkzuckerberg.com అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి అందులో తన సర్వీసులు అందిద్దామంటే ఆఫ్‌లైన్‌లో క్లయింట్స్‌కాల్స్ చేస్తే ప్రాంక్ కాల్ అనుకుని కట్ చేస్తున్నారని కోర్టులో వాపోతున్నారు.
‘నేను మార్క్ స్టీవెన్, అతను మార్క్ ఎలియట్. ఇది సరదాగా చెప్పడం లేదు. మెటా నిర్ణయం వల్ల నేను వేలాది డాలర్లు నష్టపోవడం నాకు కోపం తెప్పించింది. 40 ఏళ్లుగా న్యాయవృత్తిలో ఉన్నా. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ ఎలియట్ జుకర్‌బర్గ్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే నేను ఈ వృత్తిలో ఉన్నా. నన్ను మెటాలో బ్యాన్ చేయడం తగదు అని అన్నారు.
ఈ సందర్భంగా ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడికి ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఈ గ్రహం మీద అత్యంత ధనవంతులలో ఒకరైన జుకర్‌బర్గ్ తనని క్షమించమని కోరవచ్చు. లేదంటే అతని పడవలో గడిపేందుకు నాకు ఓ వారం రోజుల పాటు అనుమతిస్తే.. కోర్టులు, కేసులు అవసరం ఉండదని చెప్పాడు. మార్క్ స్టీవెన్ దావా వేయడంపై మెటా స్పందించింది. జుకర్‌బర్గ్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సమస్య మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం'అని పేర్కొంది.