మరో సూపర్‌ థ్రిల్లర్‌.. కేకేఆర్‌ విన్నర్‌

KKR Beat SRH in Super Over - Sakshi

అబుదాబి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ రెండు పరుగులే చేసింది. తొలి మూడు బంతులకు రెండు పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. సూపర్‌ ఓవర్‌లో రెండు వికెట్లు పడితే అక్కడితో ఒక జట్టు ఇన్నింగ్స్‌కు తెరపడుతుంది. కేకేఆర్‌ పేసర్‌ ఫెర్గ్యూసన్‌ తొలి బంతికి వార్నర్‌ను ఔట్‌ చేయగా, రెండో బంతికి రెండు పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి అబ్దుల్‌ సామద్‌ను బౌల్డ్‌ చేశాడు. దాంతో కేకేఆర్‌కు మూడు పరుగుల టార్గెట్‌ను మాత్రమే ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్దేశించింది.  కేకేఆర్‌ సూపర్‌ ఓవర్‌లో మోర్గాన్‌-కార్తీక్‌లు దిగి జట్టుకు విజయాన్ని అందించారు. రషీద్‌ ఖాన్‌ వేసిన ఆ సూపర్‌ ఓవర్‌ నాల్గో బంతికి లెగ్‌ బైస్‌ రూపంలో రెండు పరుగులు రావడంతో కేకేఆర్‌ విజయం సాధించింది. రషీద్‌ వేసిన రెండో బంతికి పరుగు రాగా, మూడో బంతికి పరుగు రాలేదు. నాల్గో బంతికి దినేశ్‌ కార్తీక్‌ లెగ్‌ బై రూపంలో రెండు పరుగులు తీయడంతో కేకేఆర్‌ విక్టరీ నమోదు చేసింది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-కేకేఆర్‌ జట్ల జరిగిన మ్యాచ్‌ టైగా ముగిసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 163 పరుగులు చేయగా, ఎస్‌ఆర్‌హెచ్‌ కూడా నిర్ణీత ఓవర్లలో 163  పరుగులే చేసింది. చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్‌ విజయానికి 18 పరుగులు కావాల్సిన తరుణంలో 17 పరుగులే వచ్చాయి. రసెల్‌ వేసిన ఆ ఓవర్‌ తొలి బంతికి నో బాల్‌ వేశాడు. దాంతో నోబాల్‌కు పరుగు వచ్చింది. ఆ తర్వాత ఫ్రీహిట్‌ బంతికి రషీద్‌ ఖాన్‌ భారీ షాట్‌ కొట్టినా పరుగు మాత్రమే సాధించాడు. ఆ తర్వాత వార్నర్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టగా, ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి లెగ్‌ బై రూపంలో పరుగు మాత్రమే వచ్చింది. దాంతో టై అయ్యింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. . టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ తొలుత ఫీల్డింగ్‌ తీసుకోవడంతో కేకేఆర్‌ బ్యాటింగ్‌కు దిగింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్‌ గిల్‌, రాహుల్‌  త్రిపాఠిలు ధాటిగా ఆరంభించారు. కాగా, త్రిపాఠి(23; 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో 48 పరుగుల వద్ద మొదటి వికెట్‌ నష్టపోయింది కేకేఆర్‌. ఆపై గిల్‌కు నితీష్‌ రాణా జత కలిశాడు. ఈ జోడి దూకుడుగా ఆడుతున్న సమయంలో ఎస్‌ఆర్‌హెచ్‌ మంచి బ్రేక్‌ సాధించింది. వరుస ఓవర్లలో గిల్‌(36; 37 బంతుల్లో 5 ఫోర్లు), రాణా(29; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)లు పెవిలియన్‌ చేరారు. రషీద్‌ ఖాన్‌ వేసిన 12 ఓవర్‌ నాల్గో బంతికి గిల్‌ ఔట్‌ కాగా, విజయ్‌ శంకర్‌ వేసిన 13 ఓవర్‌ తొలి బంతికి రాణా ఔటయ్యాడు.

వీరిద్దరూ ప్రియాం గార్గ్‌ అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతో పెవిలియన్‌ చేరక తప్పలేదు. ఆ తర్వాత రసెల్‌(9) నిరాశపరచగా, చివర్లో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌లు ఆకట్టుకోవడంతో కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కార్తీక్‌ 14 బంతుల్లో అజేయంగా 29 పరుగులు సాధించగా,  మోర్గాన్‌ 23 బంతుల్లో 34 పరుగులు చేశాడు. మోర్గాన్‌ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ ఉంది. ఈ జోడి 58 పరుగులు జత చేయడంతో కేకేఆర్‌ గౌరవప‍్రదమైన స్కోరు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో  నటరాజన్‌ రెండు వికెట్లు సాధించగా, విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌, బాసిల్‌ థంపిలకు తలో వికెట్‌ దక్కింది. 

కేకేఆర్‌ నిర్దేశించిన 164 పరుగుల టార్గెట్‌ ఛేదనలో జానీ బెయిర్‌, కేన్‌ విలియమ్సన్‌లు ఓపెనింగ్‌కు దిగారు. వీరు 57 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత విలియమ్సన్‌(29;19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కాగా, ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన ప్రియాం గార్గ్‌(4) నిరాశపరిచాడు. గార్గ్‌ ఔటైన కాసేపటికి బెయిర్‌ స్టో(36; 28 బంతుల్లో 7 ఫోర్లు) పెవిలియన్‌కు చేరగా, మనీష్‌ పాండే(6) కూడా విఫలం కావడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 82 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. విజయ్‌ శంకర్‌(7) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఆ సమయంలో వార్నర్‌(47 నాటౌట్‌;33 బంతుల్లో 5 ఫోర్లు)-సామద్‌(23; 15 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్స్‌)ల జోడి సమయోచితంగా ఆడింది. మావి వేసిన 19వ ఓవర్‌లో అబ్దుల్‌ సామద్‌ భారీ షాట్‌ కొట్టగా, దాన్ని ఫెర్గ్యూసన్‌ క్యాచ్‌ పట్టి బౌండరీ లోపలకి విసిరేశాడు.దాని గిల్‌ పట్టుకోవడంతో సామద్‌ ఔటయ్యాడు. దాంతో చివరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఒత్తిడి పెరగడం ఒకటైతే, రసెల్‌ బౌలింగ్‌ చేయడంతో బౌండరీలు ఈజీగా వచ్చాయి. ఆఖరి బంతికి రెండు పరుగులు తీయాల్సిన సమయంలో పరుగు మాత్రమే రావడంతో మ్యాచ్‌ టై అయ్యింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top