
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కకపోవడం, ఆతర్వాత అర్హుడైన అభిమన్యు ఈశ్వరన్ ఉన్నా ఆస్ట్రేలియా-ఏతో సిరీస్‌కు ఇండియా-ఏ కెప్టెన్‌గా ఎంపిక కావడం వంటి అంశాల ద్వారా టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఇటీవల వార్తల్లో నిలిచాడు.
అయ్యర్‌ను ఆసియా కప్‌కు ఎంపిక చేయకపోవడంపై సోషల్‌మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. తాజా ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా అయ్యర్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని చాలామంది సెలెక్టర్లను నిలదీశారు.
ఈ రచ్చ కొనసాగుతుండగానే శ్రేయస్‌ను ఆస్ట్రేలియా-ఏ సిరీస్‌కు భారత-ఏ కెప్టెన్‌గా నియమించడం, ఆతర్వాత అతను దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో విఫలం (2 ఇన్నింగ్స్‌ల్లో 37 పరుగులు) కావడం జరిగిపోయాయి.
తాజాగా అయ్యర్ మరో అంశానికి సంబంధించి వార్తల్లోకెక్కాడు. తన మాజీ ఐపీఎల్ జట్టు కేకేఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి ఐపీఎల్ అభిమానులకు కావాల్సిన మసాలా అందించాడు. 2024 సీజన్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన అయ్యర్.. 2025 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు మారాడు. వేలంలో పంజాబ్ అయ్యర్‌కు రికార్దు ధర ( ₹26.75 కోట్లు) చెల్లించి సొంతం చేసుకుంది.
తాజా సీజన్‌లో కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్బుతంగా రాణించి పంజాబ్ కింగ్స్‌ను కూడా ఫైనల్‌కు చేర్చిన అయ్యర్.. ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా కీర్తించబడుతున్నాడు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. అయ్యర్ పెద్ద కారణాలేమీ లేకుండానే కేకేఆర్‌ను వీడాడని అంతా అనుకున్నారు.
అయితే అయ్యర్ కేకేఆర్‌ను వీడటం వెనుక పెద్ద మతలబే ఉందని అతని తాజా వ్యాఖ్యల ద్వారా బయటపడింది. ఓ ఇంటర్వ్యూలో అయ్యర్ కేకేఆర్‌పై చాన్నాళ్లుగా మనసులో పెట్టుకున్న అసంతృప్తిని వెల్లగక్కాడు.
GQ ఇంటర్వ్యూలో అయ్యర్ మాట్లాడుతూ.. నేను ఒక ఆటగాడిగా, నాయకుడిగా చాలా ఇవ్వగలను. కానీ గౌరవం లభిస్తేనే అది సాధ్యమవుతుంది. పంజాబ్ జట్టులో నాకు పూర్తి మద్దతు, నిర్ణయాల్లో భాగస్వామ్యం లభించింది. కోచ్‌లు, మేనేజ్‌మెంట్, ఆటగాళ్లు నా మాట వినేందుకు సిద్ధంగా ఉంటారు అంటూ కేకేఆర్‌లో తనకు గౌరవం లభించలేదన్న విషయాన్ని తేటతెల్లం చేశాడు.
పంజాబ్‌లో నేను ప్రతి మీటింగ్‌లో, నిర్ణయాల్లో, స్ట్రాటజీలో భాగమయ్యాను. ఇది నాకు చాలా ఇష్టం. కేకేఆర్‌లో నేను చర్చల్లో ఉన్నా, పూర్తిగా మిక్స్‌లో లేను. నేను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను అంటూ కేకేఆర్‌లో తనకు పూర్తి స్వేచ్ఛ లేకుండిదన్న విషయాన్ని బయటపెట్టాడు.
అయ్యర్ మాటల్ని బట్టి చూస్తే.. కేకేఆర్‌లో నాయకత్వ హక్కులపై పరిమితి, నిర్ణయాల్లో భాగస్వామ్యం లేకుండిదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయ్యర్ మాటల్లో గంభీర్ కారణంగా తనకు స్వేచ్చ లేకుండా పోయిందన్న విషయం కూడా తెలుస్తుంది.
శ్రేయస్ కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన సీజన్‌లో గంభీర్ ఆ ఫ్రాంచైజీ మెంటార్‌గా ఉన్నాడు. కేకేఆర్‌లో గంభీర్ మాటకు తిరుగుండేది కాదు. గంభీర్ అతి జోక్యం వల్ల అయ్యర్ తప్పక ఇబ్బంది పడి ఉంటాడన్నది చాలామంది భావన. మొత్తంగా అయ్యర్ కేకేఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.