
భారీ పెట్టుబడులతో మెజారిటీ వాటా సొంతం
జాబితాలో స్టెర్లింగ్, సహ్యాద్రి, కేర్, మణిపాల్
హెల్త్‌కేర్ రంగంలో మరిన్ని పెట్టుబడులకు సై
బ్లాక్‌స్టోన్, టెమాసెక్, టీపీజీ, కేకేఆర్, ఎపాక్స్ పార్టనర్స్ క్యూ..
గత ఐదేళ్లుగా దేశ ఆరోగ్య పరిరక్షణ (హెల్త్‌కేర్) రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా గ్లోబల్ పీఈ సంస్థలు దేశీ ఆసుపత్రుల చైన్‌లో భారీ పెట్టుబడులకు తెరతీస్తున్నాయి. ఫలితంగా ప్రయివేట్ రంగంలోని పలు ఆసుపత్రుల పగ్గాలు టెమాసెక్, బ్లాక్‌స్టోన్ తదితర పీఈ దిగ్గజాల చేతికి చిక్కుతున్నాయి. వివరాలు చూద్దాం..
దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రుల రంగంలో ప్రపంచ ప్రయివేట్ ఈక్విటీ (పీఈ) దిగ్గజాల ఆధిపత్యానికి తెరలేచింది. గత కొన్నేళ్లుగా టెమాసెక్ హోల్డింగ్స్, బ్లాక్‌స్టోన్, సీవీసీ క్యాపిటల్, కేకేఆర్ తదితర గ్లోబల్ దిగ్గజాలు పలు ప్రయివేట్ ఆసుపత్రుల చైన్‌లను దేశీయంగా సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. మరికొన్నింటిలో మైనారిటీ వాటాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు వెచ్చిస్తున్నాయి.
ఫలితంగా సహ్యాద్రి, మణిపాల్, కేర్, స్టెర్లింగ్ తదితర సుప్రసిద్ధ ఆసుపత్రులు పీఈ సంస్థల పరమవుతున్నాయి. వెరసి 80 బిలియన్ డాలర్ల విలువైన దేశీ హెల్త్‌కేర్ రంగంలో కన్సాలిడేషన్‌కు దారి చూపుతున్నాయి. గతంలో పబ్లిక్ సంస్థలు, కుటుంబ ట్రస్ట్‌ల నిర్వహణలో కార్యకలాపాలు కొనసాగించిన పలు ఆసుపత్రులు ప్రస్తుతం పీఈ దిగ్గజాల కనుసన్నలలో సర్వీసులు అందిస్తున్నాయి. తద్వారా దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రులు కుటుంబ యాజమాన్య పరిస్థితుల నుంచి పీఈ సంస్థల నిర్వహణలోకి చేరుతున్నాయి.
కోవిడ్–19 తదుపరి
కరోనా మహమ్మారి తదుపరి దేశీ హెల్త్‌కేర్ రంగంపై గ్లోబల్ పీఈ దిగ్గజాలకు ఆసక్తి పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సింగపూర్ సంస్థ టెమాసెక్, యూఎస్ సంస్థ టీపీజీ, కేకేఆర్ భారీ పెట్టుబడులకు తెరతీశాయి. మణిపాల్, మ్యాక్స్ హాస్పిటల్ చైన్‌లో వాటాలు కొనుగోలు చేశాయి. నిజానికి 2007లోనే హైదరాబాద్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్‌లో యూకే సంస్థ ఎపాక్స్ పార్ట్‌నర్స్ పెట్టుబడులు చేపట్టింది. అయితే సాధారణంగా హెల్త్‌కేర్ రంగంలో మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితితో పీఈ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతాయని మ్యాక్స్ హెల్త్‌కేర్ సీఎండీ అభయ్ సోయి పేర్కొన్నారు. ఈ కాలంలో పెట్టుబడుల ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తాయని, మౌలిక సదుపాయాల వృద్ధికి వీలుంటుందని తెలియజేశారు. తదుపరి కార్పొరేట్స్ లేదా యాజమాన్య వ్యక్తులకు నిర్వహణను అప్పగిస్తాయని వివరించారు. 2019లో కేకేఆర్‌తో కలిసి మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో నియంత్రిత వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
పెట్టుబడుల దన్ను
పీఈ సంస్థల కారణంగా వృద్ధికి అవసరమైన పెట్టుబడులు, సుపరిపాలన, నిర్వహణ సామర్థ్యం, సర్వీసులలో నాణ్యత మెరుగుపడతాయని గ్రాంట్ థార్న్‌టన్ భారత్ నిపుణులు భానుప్రకాష్ కల్మాత్ ఎస్‌జే పేర్కొన్నారు. ఆసుపత్రుల విస్తరణకూ వీలు చిక్కుతుందని తెలియజేశారు. ప్రస్తుతం దేశీ హెల్త్‌కేర్ రంగంలో సుమారు 20 పీఈ దిగ్గజాలు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలియజేశారు. ఏ ఇతర రంగంతో పోల్చినా ఇది అధికమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా గత దశాబ్ద కాలంలో కార్పొరేట్ హాస్పిటల్ చైన్‌ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్(ఆర్‌వోఐ) మెరుగుపడినట్లు క్వాడ్రా క్యాపిటల్ పార్ట్‌నర్ సునీల్ ఠాకూర్ పేర్కొన్నారు. సమర్ధ వినియోగం, బెడ్‌లపై పెరిగిన ఆదాయం, ఉత్తమ వ్యయ నియంత్రణ ఇందుకు దోహదపడినట్లు వివరించారు.
విస్తరణకు వీలు
తొలి దశలో దేశీయంగా ఆసుపత్రులను ప్రభుత్వాలు లేదా కుటుంబ యాజమాన్య నిర్వహణలో సేవలు అందిస్తుండేవి. తదుపరి దశలో ప్రయివేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఊపిరిపోసుకుంటూ వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం యూఎస్ తరహాలో పీఈ దిగ్గజాల హవా కనిపిస్తున్నట్లు పేర్కొన్నాయి. యూఎస్‌లో ప్రయివేట్‌గా లేదా సంస్థాగత నిర్వహణలో హెల్త్ సర్వీసులు సమకూర్చుతుంటాయని తెలియజేశాయి. అయితే యూకేలో నేషనల్ హెల్త్ సర్వీస్ పేరుతో ప్రభుత్వ అజమాయిషీలోనే హెల్త్‌కేర్ రంగ నిర్వహణ ఉంటుందని వెల్లడించాయి.
కాగా.. గత కొన్నేళ్లలో దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రులను పీఈ దిగ్గజాలు హస్తగతం చేసుకుంటూ వచ్చినట్లు పీడబ్ల్యూసీ ఇండియా అడ్వయిజరీ నిపుణులు సుజయ్ శెట్టి పేర్కొన్నారు. దీంతో మరింత మందికి ఆరోగ్య పరిరక్షణా సేవలు అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా తగిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, వృత్తి నైపుణ్యం వంటి సానుకూలతలకు దారి ఏర్పడనున్నట్లు వివరించారు. దేశీయంగా ఆదాయాలతోపాటు.. లైఫ్‌స్టైల్‌తరహా వ్యాధులు పెరగడం, ఆరోగ్య పరిరక్షణపట్ల మెరుగైన అవగాహన వంటి అంశాలు హెల్త్‌కేర్ సర్వీసులకు డిమాండును పెంచుతున్నట్లు తెలియజేశారు. నిజానికి దేశీయంగా ఆసుపత్రులలో తగినన్ని పడకలు, క్రిటికల్ కేర్ సేవల కొరత ఉన్నట్లు వెల్లడించారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్