
మంత్రి సత్యకుమార్ వెల్లడి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ప్రైవేటు ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.2,725 కోట్ల బకాయిలున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. శాసనసభలో శుక్రవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పటికే రూ.557.83 కోట్లు చెల్లించాల్సి ఉందని, మరో రూ.2,168 కోట్ల బిల్లులు పరిశీలనలో ఉన్నాయన్నారు. ఒక్క ప్రభుత్వాసుపత్రులకే రూ.110.21 కోట్లు బకాయి ఉన్నట్లు చెప్పారు. ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని ప్రజల్లో అపోహలు సృష్టిస్తోందని విమర్శించారు.
గతంలో ప్రైవేటు ఆస్పత్రులు తప్పుడు అడ్మిషన్లతో ఆరోగ్యశ్రీ నిధులు కాజేశాయన్నారు. దీంతో.. 2023–24లో 88 ఆస్పత్రులపై రూ.7.68 కోట్ల జరిమానా విధించారని.. తాము అధికారంలోకి వచ్చాక వివిధ ఆస్పత్రులపై రూ.22.74 కోట్ల పెనాల్టీలు వేశామన్నారు. జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకుంటుంటే డబ్బులు రావట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారన్నారు.
ఆరోగ్యశ్రీని ఎనీ్టఆర్ వైద్యసేవగా పేరు మార్చారని.. దానికి బ్రాండింగ్ చేయాలని ఎమ్మెల్యే నసీర్ కోరారు. ఈ క్రమంలో నసీర్ పదేపదే ఆరోగ్యశ్రీ అని సం¿ోదించడంతో డిప్యూటీ స్పీకర్ సహా అందరూ నవ్వుకున్నారు. కాగా ఉద్యోగుల ఆరోగ్యబీమా(ఈహెచ్‌ఎస్) కింద రూ.320 కోట్లు బకాయిలు ఉన్నాయి.