సముద్రమంత అభిమానం.. సముద్ర గర్భంలో మెస్సీ కటౌట్‌

Kerala Football Fans Place Messi Cutout Under The Sea - Sakshi

ఫుట్‌బాల్‌ లెజెండ్‌, గ్రేటెస్ట్‌ ఆఫ్‌ టైమ్‌ (GOAT), అర్జెంటీనా కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీపై అభిమానం ఎల్లలు దాటుతోంది. విశ్వం నలుమూలల్లో ఉన్న ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌ మెస్సీ నామస్మరణతో భూమ్యాకాశాలను మార్మోగిస్తున్నారు. మెస్సీ హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ అయితే భూమి, ఆకాశాలతో పాటు నడి సంద్రంలోనూ తమ ఆరాధ్య ఫుట్‌బాలర్‌పై అభిమానాన్ని చాటుకుంటున్నారు.

కేరళకు చెందిన మెస్సీ వీరాభిమానులు.. ఫిఫా వరల్డ్‌కప్‌-2022లో అర్జెంటీనా ఫైనల్‌కు చేరితే మెస్సీ కటౌట్‌ను సముద్ర గర్భంలో ప్రతిష్టింపజేస్తామని శపథం చేసి, ఆ ప్రకారమే చేశారు. మెస్సీకి చెందిన భారీ కటౌట్‌ను వారు పడవలో తీసుకెళ్లి అరేబియా సముద్రంలో 100 అడుగుల లోతులో దిబ్బల మధ్య ప్రతిష్టింపజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. 

కాగా, సెమీస్‌లో క్రొయేషియాపై 3-0 గోల్స్‌ తేడాతో జయకేతనం ఎగురవేసి దర్జాగా ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా.. నిన్న (డిసెంబర్‌ 18) జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను 4-2 గోల్స్‌ తేడాతో ఓడించి జగజ్జేతగా ఆవిర్భవించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో నిర్ణీత సమయంతో పాటు 30 నిమిషాల అదనపు సమయం తర్వాత కూడా ఫలితం తేలకపోవడంతో (3-3) మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది.

షూటౌట్‌లో మెస్సీ సేన 4 గోల్స్‌ కొట్టగా.. ఫ్రాన్స్‌ 2 గోల్స్‌కే పరిమితం కావడంతో అర్జెంటీనా మూడోసారి వరల్డ్‌ ఛాంపియన్‌గా (1978, 1986, 2022) అవతరించింది. నిర్ణీత సమయంలో ఆర్జెంటీనా తరఫున మెస్సీ 2 గోల్స్‌, ఏంజెల్‌ డి మారియ ఒక గోల్‌ సాధించగా.. ఫ్రాన్స్‌ తరఫున కైలియన్‌ ఎంబపే హ్యాట్రిక్‌ గోల్స్‌తో అదరగొట్టాడు. 

 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top