టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. ఈ పేస్ బౌలర్‌పై కేరళ క్రికెట్ అసోసియేషన్ నిషేధాన్ని ఎత్తివేసింది. బుధవారం జరిగిన ప్రత్యేక వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కాగా గతేడాది.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ విషయంలో శ్రీశాంత్ కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA)పై విమర్శలు గుప్పించాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టుకు ఎంపిక కాకుండా పరోక్షంగా KCA సంజూకు అడ్డుపడిందని ఆరోపించాడు. అతడిని దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడకుండా చేసిందని శ్రీశాంత్ అసోసియేషన్‌ను నిందించాడు.
ఈ నేపథ్యంలో అసోసియేషన్ ప్రతిష్ట, విశ్వసనీయతను దెబ్బతీసేలా వ్యవహరించాడంటూ కేసీఏ శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేధం విధించింది. అయితే, ఈ విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ శ్రీశాంత్ అసోసియేషన్‌కు భేషరతుగా క్షమాపణలు చెప్పాడు.
అందుకే తాము శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేస్తున్నామని అసోసియేషన్ బుధవారం వెల్లడించింది. కాగా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో శ్రీశాంత్ సభ్యుడు. ఆటలో నైపుణ్యంతో పాటు.. అతడి జీవితంలో వివాదాలకూ కొదవలేదు.
ఐపీఎల్-2013 సీజన్‌లో ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో అతడిపై జీవితకాల నిషేధం పడింది. అయితే ఆరేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో ఈ శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో 2020లో శ్రీశాంత్‌పై నిషేధం తొలగిపోయింది.
కాగా టీమిండియా తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 87, 75, 40 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో హర్భజన్ సింగ్ శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టగా ‘స్లాప్‌గేట్’ పేరిట రేగిన వివాదం లీగ్ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.


