Andhra Premier League 2022: ఏపీఎల్‌ తుది పోరు.. కోస్టల్‌ రైడర్స్‌తో బెజవాడ టైగర్స్‌ ఢీ

Kapil Dev to hand over winning trophy of APL 2022 in Vizag - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: ఏపీఎల్‌ తొలి సీజన్‌.. టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. వైఎస్సార్‌ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే పోరులో విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ఎవరు ఎగరేసుకు పోనున్నారో తేలిపోనుంది. టైటిల్‌ పోరులో రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ.15 లక్షల నగదు ప్రోత్సాహాన్ని అందుకోనుంది.  కాగా.. తొలి సీజన్‌కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. దీంతో మూడు మ్యాచ్‌లను కుదించి నిర్వహించారు. నాలుగు మ్యాచ్‌లను రద్దు చేశారు.  

టైటిల్‌ పోరుకు బెజవాడ టైగర్స్‌     
ఏపీఎల్‌ క్వాలిఫైయర్‌ రెండో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెజవాడ టైగర్స్‌ లక్ష్య ఛేదనకే మొగ్గు చూపింది. వైఎస్సార్‌ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయలసీమ కింగ్స్‌ మూడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. లలిత్‌కు లెగ్‌బిఫోర్‌గా ప్రశాంత్‌(29) దొరికిపోగా.. మరో ఓపెనర్‌ అభిషేక్‌(41) మనీష్‌ బౌలింగ్‌లో షార్ట్‌ ఫైన్‌లెగ్‌లో సాయితేజకి క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. వినయ్‌(16) లలిత్‌ బౌలింగ్‌లోనే డీప్‌ స్క్వేర్‌లెగ్‌లో అఖిల్‌కు క్యాచ్‌ ఇ చ్చాడు. కెప్టెన్‌ గిరినాథ్‌ 53 పరుగులు, రషీద్‌ 40 పరుగులతో నిలిచారు. 187 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెజవాడ టైగర్స్‌ ఓపెనర్‌ మహీప్‌ ఒక్క పరుగే చేసి సంతోష్‌ బౌలింగ్‌లో డీప్‌ పాయింట్‌లో కార్తికేయకు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు.

అతని స్థానంలో వచ్చిన అవినాష్‌ ఒక పరుగుతో, మరో ఓపెనర్‌ ప్రణీత్‌ 24 పరుగులతో ఆడుతుండగా వర్షం వచ్చింది. నాలుగు ఓవర్లలో ఒక వికెట్‌కు 29 పరుగుల వద్ద మ్యాచ్‌ నిలిచిపోయింది. ఫలి తం తేలేందుకు కనీసం మరో ఓవర్‌ జరగాల్సి ఉండగా స్టేడియంలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయింది. లీగ్‌ దశలో పాయింట్ల ఆధారంగా బెజవాడ టైగర్స్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో ఏపీఎల్‌ తొలి సీజన్‌ టైటిల్‌ పోరుకు బెజవాడ టైగర్స్‌ చేరుకుంది. ఆదివారం జరిగే తుది పోరులో కోస్టల్‌ రైడర్స్‌తో బెజవాడ టైగర్స్‌ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఆదివారం రాత్రి ఆరున్నరకు ప్రారంభం కానుండగా విజేతకు ట్రోఫీ అందించేందుకు క్రికెట్‌ లెజెండ్‌ కపిల్‌దేవ్‌ రానున్నారు. ఈ నాకవుట్‌ మ్యాచ్‌ను ఉచితంగానే ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
చదవండిTamim Iqbal: టీ20లకు గుడ్‌బై చెప్పిన బంగ్లాదేశ్‌ స్టార్‌ ఓపెనర్‌..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top