
టీమిండియా మాజీ క్రికెటర్, గ్రేట్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. తాజాగా ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1997 మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం గురుంచి యోగరాజ్ మాట్లాడాడు.
భారత దిగ్గజ ఆటగాళ్లు కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్‌లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయని, ఉద్దేశ్వపూర్వకంగానే కేసును నీరు గార్చారని ఆయన అన్నాడు. కాగా 1997లో కలిప్ దేవ్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అయితే అందుకు ఎటువంటి ఆధారాలు లేవని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
"సుప్రీం కోర్టులో కొట్టివేయబడిన మ్యాచ్-ఫిక్సింగ్ కేసు ఫైల్ ఎక్కడ ఉందో జర్నలిస్టులందరినీ అడగండి. ఆ కేసులో మొదటి పేరు కపిల్ దేవ్‌ది ఉంటుంది. ఆ తర్వాత అజారుద్దీన్‌లతో పాటు చాలా మంది ఆటగాళ్ల పేర్లు ఉంటాయి. ఆ కేసును ఎందుకు కొట్టేశారు? తర్వాత ఎందుకు రీ ఓపెన్ చేయలేదు? ఎందుకు రీ ఓపెన్ చేయలేదో నాకు తెలుసు. ఎందుకంటే ఇందులో చాలా మంది దిగ్గజ క్రికెటర్ల ప్రమేయం ఉందని యోగరాజ్ పేర్కొన్నారు.
అసలేంటి మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం?
1997లో టీమిండియా మాజీ ఆటగాడు మనోజ్ ప్రభాకర్ ఓ మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సహచర ఆటగాళ్లపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు. శ్రీలంక వేదికగా జరిగిన సింగర్ కప్-1994లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మ్యాచ్ ఫిక్స్ చేసేందుకు సహచర భారత ఆటగాడు తనకు రూ. 25 లక్షలు ఆఫర్ చేశాడని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
దీంతో బీసీసీఐ భారత విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అజహర్‌తో పాటు సచిన్, కపిల్‌దేవ్, సునీల్ గావస్కర్, నయన్ మోంగియా , అజిత్ వాడేకర్ తదితరులు జస్టిస్ చంద్రచూడ్ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. అయితే ప్రభాకర్ తన ఆరోపణలకు సరైన ఆధారాలు ఇవ్వలేదని కమిటీ తేల్చింది.
అందువల్ల అన్ని ఆరోపణలను కొట్టివేసింది. ఈ కమిటీ నివేదిక తర్వాత కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కొనసాగాయి. 2000లో మళ్లీ మనోజ్ ప్రభాకర్ మీడియాకు ముందుకు వచ్చాడు. తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ ఆఫర్ చేశాడని మరో బాంబు పేల్చాడు.
దీంతో సీబీఐ రంగంలో దిగింది. సీబీఐ విచారణలో కూడా కపిల్ దేవ్ నిర్ధేషిగానే తేలింది. కానీ మహ్మద్ అజహరుద్దీన్‌ను మాత్రం సీబీఐ దోషిగా తేల్చింది. మహ్మద్ అజహరుద్దీన్ అప్పటి దక్షిణాఫ్రికా కెప్టెన్ హాన్సీ క్రోనేతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. సీబీఐ రిపోర్ట్ ఆధారంగా అజహరుద్దీన్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే 2012లో కోర్టు ఆ నిషేధాన్ని రద్దు చేసింది.
చదవండి: పాక్‌లో మ్యాచ్ జరుగుతుండగా ఉగ్రదాడి.. సౌతాఫ్రికా పర్యటనపై నీలినీడలు?