
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రదాడి తీవ్ర కలకలం రేపింది. ఉగ్రవాదులు బజౌర్ జిల్లా ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్‌ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. శనివారం కౌసర్ క్రికెట్ మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఐఈడీని ఉపయోగించి పేలుడు జరిపారని బజౌర్ జిల్లా పోలీసు అధికారి వక్వాస్ రఫీక్వ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గాయపడిన వారిని జిల్లా ప్రధాన అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు.
ఇప్పటివరకు ఏ ఉగ్రవాది సంస్థ కూడా బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటన చేయలేదు. అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా భద్రతా దళాలు ప్రారంభించిన 'ఆపరేషన్ సర్బకాఫ్'కు ప్రతిస్పందనగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
స్వల్ప తొక్కిసలాట..
ఈ పేలుడు తర్వాత క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లు, మైదానంలో ఉన్న వీక్షకులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటన జరగడం ఇది రెండో సారి. కొన్ని వారాల కిందట పోలీస్ స్టేషన్‌పై క్వాడ్‌కాప్టర్ ద్వారా దాడి జరిగింది. ఈ దాడిలో ఒక
పోలీసు కానిస్టేబుల్ , పౌరుడు గాయపడ్డారు.
సౌతాఫ్రికా పర్యటనపై నీలినీడలు?
కాగా వచ్చే నెలలో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ప్రోటీస్ టూర్‌కు ముందు తమ దేశంలో ఇటువంటి ఉగ్రదాడులు జరుగుతుండడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆందోళన చెందతుంది. అయితే ఇప్పటికే సౌతాఫ్రికాకు చెందిన భద్రతా అధికారులు కొంత మంది పాక్‌లో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశముంది. ఇటీవల కాలంలో పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు పలు ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరిగాయి.