RR VS CSK: ఆ క్షణంలో వార్నర్ నన్ను ఆవహించాడు: అశ్విన్

Just Brought Out David Warner Inside Me Says Ashwin After Guiding RR To Playoffs - Sakshi

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నిన్న (మే 20) సీఎస్‌కేతో జరిగిన ఆసక్తికర సమరంలో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో (1/28, 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 40 నాటౌట్‌) చెలరేగిన అశ్విన్‌.. మ్యాచ్‌ గెలిపించడమే కాకుండా రాజస్థాన్‌ను అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. విజయానంతరం సింహ గర్జనతో ఛాతీని గుద్దుకుంటూ సంబురాలు చేసుకున్న యాష్‌.. మ్యాచ్‌ అనంతరం సదరు సెలబ్రేషన్స్‌పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్‌కేపై గెలుపు మిలియన్‌ డాలర్లు సంపాదించిన ఫీలింగ్‌ ఇచ్చిందని.. ఆ క్షణం​ తనలోకి డేవిడ్‌ వార్నర్‌ ఆవహించాడని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. 

ప్రస్తుత సీజన్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ అదరగొడుతున్న అశ్విన్‌.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 38 బంతుల్లో అర్ధశతకం బాదాడు. తాజాగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనూ అలాంటి ప్రదర్శనే రిపీట్‌ చేసిన యాష్‌.. చివరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 7 పరుగులు అవసరమవగా.. మరో రెండు బంతులు మిగిలుండగానే బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు. విన్నింగ్ షాట్ కొట్టిన అనంతరం అశ్విన్ గట్టిగా అరుస్తూ ఛాతిని గుద్దుకుంటూ సంబురాలు చేసుకున్నాడు. 

ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకిన రాజస్థాన్‌.. మే 24న క్వాలిఫయర్‌ 1లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డన్స్‌ వేదిక జరిగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓడినప్పటికి.. క్వాలిఫయర్‌ 2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్‌ 1లో ఓడిన జట్టు క్వాలిఫయర్‌ 2లో తలపడతాయి. కాగా, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేయగా.. ఛేదనలో రాజస్థాన్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 
చదవండి: ఐపీఎల్‌ చరిత్రలో చహల్‌ అరుదైన ఫీట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top